ఏపీ మరో శ్రీలంక అయిపోతుంది.. శ్రీలంకను చూసి ఏపీ పాఠాలు నేర్వాలి.. అప్పులు చేసి జగన్ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు… అంటూ తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా అందుకున్న పాట కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు గట్టిగా కౌంటర్ చేయలేకపోయింది. వాస్తవానికి తెలుగుదేశం హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీదే నడిచింది.
చంద్రబాబు హయాంలో 2014 నుంచి విపరీతమైన స్థాయిలోనే అప్పులు చేశారు. అప్పుడు అప్పులు చేసి కూడా ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదు. పచ్చ చొక్కాల జేబులు నింపేపథకాలను నమ్ముకుని చంద్రబాబు పార్టీని నిండా ముంచుకున్నారు. ఇక వైఎస్ జగన్ హయాంలో అప్పులు చేస్తున్నా.. పథకాల లబ్ధి డైరెక్టుగా ప్రజలకే కలుగుతోంది. ఈ వాదన ఎలా ఉన్నా.. దేశంలోనే ఏపీ చేస్తున్నంతలా అప్పులు మరే రాష్ట్రం కూడా చేయడం లేదనేంత రీతిలో పచ్చ వాదన కొనసాగుతూ వచ్చింది.
గోబెల్స్ ప్రచారంలో ఆరి తేరిన పచ్చ పార్టీకి, పచ్చ మీడియాకూ ఇప్పుడు కొత్త ప్రచారాలను చేయడం కష్టం కాదు. అయితే.. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రాల అప్పుల జాబితా ను కేంద్రం వెల్లడించడంతో ఏ రాష్ట్రం పరిస్థితి ఏమిటో తేటతెల్లం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్న వైనాన్ని ఎండగట్ట ప్రయత్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై చర్చకు ఆస్కారం ఇచ్చింది. రాష్ట్రాల అప్పుల వారీగా చూస్తే.. దేశంలోని కొన్ని పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీ తక్కువ స్థాయిలో ఉంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం.. అప్పుల్లో ఏపీ నంబర్ వన్ అయితే కాదు!
దేశంలోనే ఎక్కువ స్థాయి అప్పులున్న రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో 6.59 లక్షల కోట్లు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ రెండు రాష్ట్రాల అప్పులూ ఆరు లక్షల కోట్ల కు పై మాటే. ఒక వెస్ట్ బెంగాల్ ఐదు లక్షల కోట్ల స్థాయిలో, గుజరాత్ నాలుగు లక్షల కోట్ల స్థాయిలో ఉంది. కర్ణాటక అప్పులు 4.62 లక్షల కోట్ల పైనే! ఇలా దేశంలో పరిపాలనకూ మోడల్ గా చెప్పబడే రాష్ట్రాల అప్పులు ఈ రేంజ్ లో ఉన్నాయి. వీటన్నింటి తర్వాతే ఏపీ ఉంది. ఏపీకి 3.98 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా కేంద్రం చెప్పింది. తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పు ఉంది.
మరి మోడీ పాలన దగ్గర నుంచి వెలిగిపోతోందనిపించుకుంటున్న గుజరాత్ కన్నా, అన్నీ ఉన్న కర్ణాటక కన్నా.. ఏపీ అప్పుల భారం తక్కువే! దేశంలోనే ప్రథమ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రంగా ఏపీ నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తుంది. అయితే అప్పుల్లో మాత్రం చాలా రాష్ట్రల కన్నా తక్కువ స్థాయిలోనే ఉంది. పార్లమెంట్ ద్వారా వెల్లడైన ఈ వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగా జనంలోకి తీసుకోగలిగితే.. ఏపీ విషయంలో పచ్చ ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టవుతుంది.