కైకాల సత్యనారాయణ గ్రేట్ విలన్. మంచి అన్నయ్య, యముడు, భీముడు, దుర్యోధనుడు, తాతయ్య, తాగుబోతు, ఆయన రూపాలు అన్నీఇన్నీ కాదు. 700 పైగా సినిమాల్లో నటించాడు. SVR తర్వాత తెలుగు సినిమాపై ఒక ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తి.
చిన్నప్పుడు సత్యనారాయణను చూస్తే భయం. ఆ చూపు, మాట, నవ్వు, విషపు నాగు మానవ రూపంలో వున్నట్టుండేది. అయితే మెల్లిగా అర్థమైంది ఏమంటే అలాంటి వాళ్లతో ప్రమాదం తక్కువ. చూడగానే విలన్ అని గుర్తు పట్టొచ్చు. కానీ నాగభూషణం, అల్లు రామలింగయ్యలతోనే అసలు డేంజర్. వాళ్లు మంచి మాటలు చెబుతూ, ప్రజాసేవ చేస్తున్నట్టు నటిస్తూ ముంచేస్తారు. సత్యనారాయణ అలా కాదు, పాత చెక్క పెట్టెలు, తారు డబ్బాల మధ్య కూచొని జగ్గూ అంటూ వుంటాడు.
సత్యనారాయణ మీద బాగా కోపం వచ్చింది మోసగాళ్లకు మోసగాడులో. నక్కజిత్తుల నాగన్నని (నాగభూషణం) భోజనానికి పిలుస్తాడు. నాగన్న ఎడారుల్లో తిరిగి అలసిపోయి తిండికి మొహంవాచి వుంటాడు. పిలవగానే వస్తాడు. పెద్ద టేబుల్ మీద గుడ్లు, తందూరి చికెన్, కోడి పులుసు ఇలా చాలా వుంటాయి. స్క్రీన్ మీద అవన్నీ చూడగానే మతిపోయింది. 1972 నాటికి పౌల్ట్రీ రంగం లేదు. పండగలకి కోళ్లు కోసుకునే వాళ్లు. కోళ్లు చాలా ఖరీదు. తిన్నా కూడా పులుసులోకి నాలుగు ముక్కలు తప్ప, తందూరి చికెన్ వుంటుందని మధ్య తరగతి వాళ్లకి తెలియని కాలం. ఇక గుడ్డు కూడా అంతే. జ్వరం వస్తేనే గుడ్డు, బ్రెడ్డు. అవి తినడానికైనా జ్వరం రావాలని కోరుకునే వాళ్లం.
నాగన్న పరిస్థితి కూడా అదే. గుడ్లు నమిలేశాడు. లెగ్ పీస్‌లు కొరికేశాడు. సూప్ తాగాడు. భోజనం ఇంకా పూర్తి కాకుండానే “ఇక నిధి రహస్యం చెప్పు” అన్నాడు సత్యనారాయణ. నాగన్నకి తెలిస్తే కదా! ఏదో పేరు బాగుందని పగడాల సుబ్బయ్య అని మార్చుకున్నాడు.
భోజనానికి పిలిచినా మంచీమర్యాద కూడా లేకుండా కొరడాలతో తిన్నది కక్కేట్టు తంతాడు. ఈ గొడవలో చికెన్, గుడ్లు నేలపాలయ్యాయి. ఇది నా బాధ. ఇంతలో కృష్ణ వచ్చి ఎడమ చేత్తో నాలుగు తన్ని, కుడి చేత్తో గన్ పేలుస్తూ సత్యనారాయణని ఇరగగదీసి నాగన్నని రక్షిస్తాడు.
సినిమాల్లో ఎంతో మంది విలన్లను చూశాం కానీ, భోజనానికి పిలిచి చితకబాదింది మాత్రం సత్యనారాయణే. కోడలు దిద్దిన కాపురంలో సాయిబాబాని పోలిన వేషంలో కనిపించాడు. ఆ రోజుల్లో అదో సెన్సేషన్. కోర మీసంతో జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేస్తూ “నా యాల్ది” అనే సత్యనారాయణ, శారద సినిమాలో వేసిన అన్నయ్య పాత్ర పూర్తిగా డిఫరెంట్. చెల్లెలు మానసిక స్థితిని చూసి కుమిలిపోయే అన్నగా కన్నీళ్లు పెట్టించాడు.
మనుషులంతా ఒకటేలో NTR కి తాతగా వేశాడు. NTR ను పోలిన రూపం వుండడం తొలిరోజుల్లో ఆయనకి ప్లస్ అయ్యింది. రాముడుభీముడులో NTR కి డూప్‌గా వేశాడు. కారణం తెలియదు కానీ, సినిమా ఆఖరు గ్రూప్ ఫొటోలో NTR కు బదులు సత్యనారాయణే కనిపిస్తాడు.
యముడు అంటే ఆయన తప్ప ఇంకెవరూ గుర్తు రాకపోవడం గొప్పతనం. జూలై 25 ఆయన 87వ పుట్టిన రోజు. అనారోగ్యంతో ఉన్న ఆయనకి చిరంజీవి విషెస్ చెప్పి కేక్ కట్ చేయించాడు. చిరంజీవి సంస్కారం కైకాలకి మరింత శక్తినిచ్చి తిరిగి నటించేలా చేయాలి. పెద్దాయన నూరవ పుట్టిన రోజు కూడా జరుపుకోవాలి.
జీఆర్ మహర్షి