తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ముందస్తుగా జరుగుతాయా, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎలా జరిగినప్పటికీ అధికారం తమదే అంటున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆరే సీఎం అవుతారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని కొందరు అంటున్నారు కానీ కేసీఆర్ ఆలోచనలనుబట్టి, రాజకీయ పరిస్థితులనుబట్టి ఈ మార్పు ఉంటే ఉండొచ్చు. టీఆర్ఎస్ లో తండ్రీకొడుకులకు తప్ప వేరేవాళ్లకు అవకాశం లేదు.
ఇక కాంగ్రెస్ లో, బీజేపీలో పెద్ద తలకాయలంతా సీఎం పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండు పార్టీల్లో కీలక నాయకులు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎంపీలు కూడా సీఎం కావొచ్చనుకోండి …కానీ సీఎం పదవి కోసం పోటీ పడాలంటే ఎమ్మెల్యేగా ఉండటం బెటర్ కదా. అందుకే ఎంపీలుగా ఉన్నోళ్లు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. కాషాయం, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేయడం కోసం విజయావకాశాలపై సర్వే కూడా చేయించుకుంటున్నారట.
కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ సీనియర్లే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉండే నేతలే. అందుకే వీరు అసెంబ్లీకి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. నిజానికి వీళ్లు ముగ్గురు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారే. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు ఉత్తమ్. ఆ నియోజకవర్గంలో కూడా జోరుగా తిరుగుతున్నారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తాను నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆయన కూడా నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్నారు.
ఇక బీజేపీ ఎంపీలది అదే పరిస్థితి. ఆ పార్టీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ. గతంలో ఆయన అంబర్ పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి అంబర్ పేట నుంచి అసెంబ్లీకి పోటే చేస్తారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ గెలిస్తే సీఎం రేసులో కిషన్ రెడ్డి కూడా ఉంటారని.. అందుకే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ. గతంలో ఆయన కరీంనగర్ అసెంబ్లీ నుంచి పలుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా చెబుతున్నారు. కరీంనగర్ లేదా వేములవాడ నుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి బండి సంజయ్ పోటీ చేయాలనే ప్లాన్ లో ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో సంజయ్ ముందుంటారనే టాక్ నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తొలిసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో ఆర్మూరు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. కానీ సీఎం రేసులో ఉండే అవకాశం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉండాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సోయం సీఎం రేసులో లేకున్నా ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమంటున్నారు. కాంగ్రెస్, బీజేపీపీలో ఏది అధికారంలోకి వస్తుంది? ఒకవేళ ఏ పార్టీ గెలిచినా సీఎం ఎవరు కావాలని నిర్ణయించేది ఆ పార్టీ అధిష్టానమే.