ఓటిటి వల్ల సినిమా రంగానికి జరిగిన కీలకమైన ఉపయోగం ఒకటి వుంది. అదే పైరసీ భూతం మాయం కావడం. ఓటిటిలో సినిమా ఇలా విడుదలై అలా వచ్చేస్తుండడంతో, పైరసీ ని జనాలు మరచిపోయారు. ఇండస్ట్రీ కూడా ఈ మార్పును పెద్దగ పట్టించుకోలేదు. దాదాపు పైరసీని మరచిపోయింది కూడా. అయితే ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పైరసీ భూతానికి పురుడుపోస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓటిటి విషయంలో టాలీవుడ్ ఒక్క తాటిపైకి వచ్చి కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది.
ఆరు కోట్ల పైబడిన ప్రతి సినిమా 10 వారాల వరకు ఓటిటికి ఇవ్వకూడదు అన్నది తాజా నిర్ణయం. ఆరు కోట్ల లోపు సినిమాలు నాలుగు వారాలు. పది వారాలు అంటే రెండున్నర నెలలు. టాప్ స్టార్ అభిమానులు తమ హీరో సినిమాను థియేటర్ లో ఎలాగూ చూస్తారు. చూడని వారు గతంలో పైరసీ కోసం చూసేవారు. ఇప్పుడు మానేసారు. కానీ మళ్లీ ఇప్పుడు అదే మొదలవుతుంది. గతంలో ప్రత్యేకించి పైరసీ చేయాలి. ఇప్పుడు థియేటర్ కు వచ్చే ప్రతి ప్రేక్షకుడి దగ్గర స్మార్ట్ ఫోన్ నే.
బి, సి సెంటర్లలో ఇది ఎవ్వరూ పట్టించుకునే వ్యవహారం కాదు. ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా అలవాటు తప్పిన పైరసీ లో మళ్లీ జనాలు సినిమాలు చూస్తారా? అన్న అనుమానం అక్కరలేదు. గతంలో టాలీవుడ్ జనాలే పైరసీ సీడీలు చూసిన సంగతి గుర్తున్నదే.
పైగా థియేటర్ల యజమానులు పర్సంటేజ్ సిస్టమ్ అడుగుతున్నారు. మొదటి వారం ఓ విధంగా, మలి వారం మరో విధంగా, పెద్ద సినిమాలకు ఒకలా, చిన్న, మీడియం సినిమాలకు మరోలా. ఇలాంటిది ఫిక్స్ అయితే థియేటర్ల టికెట్ రేట్లు తగ్గడం అన్నది కష్టం. ఎప్పుడయితే టికెట్ రేట్లు ఎక్కువ అనే భావన వస్తుందో అప్పుడు పైరసీ వైపు మళ్లీ దృష్టి మళ్లుతుంది.
రేటు తగ్గిపోతుంది
పదివారాల వరకు ఓటిటి కి ఇవ్వము అంటే రేటు రావడం కష్టమే. ఓటిటి సంస్థలు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నంత భారీగా రేట్లు ఆఫర్ చేయవు. అందుకే పది వారాలు అంటున్నారు కానీ బాలీవుడ్ లో మాదిరిగా 56 రోజులకే ఇచ్చేలా డిస్కషన్లు సాగిస్తారని తెలుస్తోంది. అయినా అప్పుడు కూడా ఇప్పుడు వచ్చినంత రేట్లు రావు. పైగా రాను రాను ఓటిటి రేట్లు తగ్గుతాయి కానీ పెరగవు అనే అంచనాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
అందువల్ల టాలీవుడ్ బాగుపడాలి అంటే ఖర్చులు తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. నాన్ థియేటర్ ఆదాయానికి కాస్త అటుగా నిర్మాణ వ్యయం వుంటే థియేటర్ మీద భారం తగ్గుతుంది. అలా అని చెప్పి హీరోలను నిర్మాణ భాగస్వాములు కండి అంటే కూడా వర్కవుట్ కాదు. నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే నిర్మాతే ఎందుకు తామే తీసుకుంటాం అని హీరోలు అనొచ్చు. ఎందుకంటే దాదాపు ప్రతి హీరోకి స్వంత ప్రొడక్షన్ హవుస్ లు వున్నాయి.
అయిదుగురుతో కమిటీ
అందువల్ల ఉత్తరోత్తరా పరిష్కార మార్గం నిర్మాణ వ్యయం తగ్గించడం ఒక్కటే మార్గం. ఆ దిశగానే టాలీవుడ్ ఇప్పుడు ఆలోచిస్తోంది. ఇప్పటికే మైత్రీ రవి, సితార నాగవంశీ, స్వప్న సినిమాస్ స్వప్న, దిల్ రాజు, మరో నిర్మాతతో కలిపి అయిదుగురు సభ్యులతో కమిటీ వేసారు. ఇప్పుడు ఈ కమిటీ హీరోలు, దర్శకులతో చర్చింది రెమ్యూనిరేషన్ల, నిర్మాణ వ్యయం మీద డిస్కషన్లు సాగిస్తుంది. అయితే టాప్ 6 హీరోలను ఈ విషయంలో మినహాయిస్తారన్నది లోపాయకారీ డిస్కషన్ అని వినిపిస్తోంది. మిగిలిన టైర్ 2, 3 హీరోలు, క్యారెక్టర్ నటులు, ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
నిర్మాణ వ్యయం కనీసం 25 నుంచి 30 శాతం తగ్గిస్తే తప్ప పరిస్థితి చక్కబడదని, మరో ప్రత్యామ్నాయం లేదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక పక్క వర్కర్లు రేట్లు పెంచమంటుంటే ఇది సాధ్యమా అన్నది అనుమానం. అందులోనూ టాప్ 6 హీరోలను వదిలేస్తే ఇక జరిగేదేమిటి?
అంతా మీరే చేసారు
కౌన్సిల్ మీటింగ్ లో ఓ నిర్మాత మాట్లాడుతూ అంతా టాలీవుడ్ పెద్దలే చేసారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి టికెట్ ల ధరలు పెంచుతూ జీవో తెచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. హీరోలకు ఇష్టం వచ్చినట్లు రెమ్యూనిరేషన్లు ఆఫర్ చేసింది ఎవరు అని నిలదీసారు.
మీరు కూర్చో మంటే కూర్చోవాలి. నిల్చోమంటే నిల్చోవాలి అని విమర్శించారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవారే రేపు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాం అంటారన్నారు.