తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆత్మగౌరవం అనే మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఆత్మ గౌరవం అనే మాటను చాలా విచ్చలవిడిగా వాడుతుంటారు. దాని అర్ధం ఏమిటో వీళ్లకు సరిగా తెలియదు. ఆ పదం చాలా గొప్పగా ఉందని వాడుతుంటారు. ఈ పదాన్ని మొదటిసారిగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి రామారావు ప్రజలకు పరిచయం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు.
అప్పటి పరిస్థితుల్లో ఆయన ఆత్మగౌరవం అనే పదం వాడటం సరిపోయింది. ఇక కేసీఆర్ టీడీపీలో ఎదిగిన నాయకుడే కదా. ఆయన కూడా అదే పదం పట్టుకొని ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆంధ్రా పాలకుల నుంచి (ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణా నాయకులూ భాగస్వాములే) తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడటానికే తెలంగాణా కావాలని కోరుతున్నామని, అందుకే ఉద్యమం చేస్తున్నామని అప్పట్లో అదే పనిగా చెప్పేవారు.
ప్రత్యేక తెలంగాణా ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆత్మగౌరవం పదం ప్రాచుర్యంలోనే ఉంది. ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది కూడా. అన్ని వర్గాల ఓట్ల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రతి కులానికి ప్రత్యేక భవనాలు మంజూరు చేశారు. ఆ భవనాల నిర్మాణానికి మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు భూములు ఉచితంగా ఇచ్చారు. భవనాల నిర్మాణానికి కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఆ భవనాలకు ఆత్మగౌరవ భవనాలు అని పేరు పెట్టారు. ప్రతి కులం నాయకులు ఏదో ఒక సందర్భంలో తమ ఆత్మగౌరవం దెబ్బతిందని అంటూ ఉంటారు. ఇక కేసీఆర్ నుంచి మంత్రులు, టీఆరెస్ నాయకుల వరకు దాదాపు ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతుంటారు.
కేంద్రం తెలంగాణా ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని, ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని అంటుంటారు. ఏ పార్టీ రాజకీయ నాయకులైనా కావొచ్చు ఆత్మ గౌరవం అనే పదం వాడకుండా మాట్లాడలేరు. పార్టీలు మారేవారు కూడా తమ ఆత్మ గౌరవం దెబ్బ తిన్నందువల్లనే పార్టీ మారుతున్నామని అంటుంటారు. ఇలా ఈ ఒక్క మాట గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ ను అన్ని విధాలా సమర్ధించి ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్ గజ్వేల్ లో తాను పోటీ చేసి కేసీఆర్ ను ఓడిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే కదా. సీఎం మీద పోటీ చేసుడే …ఓడించుడే అని మరోసారి శపథం చేశాడు. గజ్వేల్ ప్రజలు తనను ఆదరిస్తారన్నాడు. కేసీఆర్ అహంకారానికి- ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతుందన్నాడు. అంటే కేసీఆర్ అహంకారానికి, తాను ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పాడన్న మాట.