ఆయన చుట్టూ ఆశావహులు

ఆయన వైసీపీలో కీలకంగా ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వయాన బాబాయ్ అవుతారు. మరి ఇంత దగ్గర చుట్టరికం ఉన్నాక ఆయన చుట్టూ నేతలు అల్లుకుపోవడం అంటే అది సహజమే కదా.…

ఆయన వైసీపీలో కీలకంగా ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి స్వయాన బాబాయ్ అవుతారు. మరి ఇంత దగ్గర చుట్టరికం ఉన్నాక ఆయన చుట్టూ నేతలు అల్లుకుపోవడం అంటే అది సహజమే కదా. ఉమ్మడి విశాఖ జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ టూర్ లో నేతల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రత్యేకించి ఆశావహులు ఆయన చుట్టూ చేరుతున్నారు. వారంతా ఆయన బస చేసిన ప్రదేశానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పుష్పగుచ్చాలు, ఫోటోలు మర్యాదపూర్వక‌ కలయికలు అని బయటకు చెబుతున్నా తమ వైపు చూడమనే వారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

ఇక ఏపీ హొటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ పవన్ కార్తీక్  వైవీ సుబ్బారెడ్డిని కలసి చర్చలు జరిపారు. ఆయన ఏమైనా రాజకీయాల వైపు చూస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలాగే శ్రీకాకుళానికి చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు కూడా వైవీ సుబ్బారెడ్డిని కలిసి మాట్లాడారు.

వారూ వీరు అని కాదు అన్ని వర్గాలు, అందరు నేతలు వైవీని కలుస్తున్నారు. రానున్నవి సార్వత్రిక ఎన్నికలు, మరి ఆశావహులు చాలా మంది ఉన్నారు. వారంతా తమ అర్జీలను వైవీ ముందు పెట్టారని కూడా చెబుతున్నారు.