బాలయ్య మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతున్నాడు. పోలీస్ గెటప్ తో ఇప్పటికే మంచి హిట్స్ కొట్టిన ఈ హీరో, ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. మరీ ముఖ్యంగా వరుసగా ఫ్లాపులు (కాదు..కాదు.. డిజాస్టర్లు) వస్తున్న వేళ.. పోలీస్ పాత్రపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రంజిత్ కుమార్ అనే పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించి స్టోరీ ఇప్పటికే లాక్ అయింది. మే నెలలో ఓపెనింగ్ కానిచ్చేసి, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
గతంలో రౌడీ ఇన్ స్పెక్టర్, లక్ష్మీనరసింహ సినిమాల్లో పోలీస్ గా కనిపించాడు బాలయ్య. ఆ రెండూ హిట్టయ్యాయి. సేమ్ టైం ఇదే పాత్రతో కొన్ని ఫ్లాపులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి అదే పాత్రలో బాలయ్యను చూపించేందుకు రెడీ అవుతున్నాడు కేఎస్ రవికుమార్. సినిమాలో బాలయ్య పాత్ర అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తుందట.
సి.కల్యాణ్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను ఏకథాటిగా, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో పూర్తిచేయాలని నిర్ణయించాడు బాలయ్య. ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు.