మ‌రో ప్ర‌మాద‌క‌ర ఫంగ‌స్ గుర్తింపు

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకెండ్ వేవ్‌, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌ల‌తో జ‌నం చ‌స్తుంటే, ఇవి చాల‌వ‌ని మ‌రో ఫంగ‌స్ కూడా వ‌చ్చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్య‌క్తిలో గ్రీన్‌ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు మొట్ట‌మొద‌టిసారిగా క‌నిపించ‌డం…

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకెండ్ వేవ్‌, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌ల‌తో జ‌నం చ‌స్తుంటే, ఇవి చాల‌వ‌ని మ‌రో ఫంగ‌స్ కూడా వ‌చ్చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్య‌క్తిలో గ్రీన్‌ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు మొట్ట‌మొద‌టిసారిగా క‌నిపించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తొలిసారిగా గ్రీన్ ఫంగ‌స్ కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ముఖ్యంగా బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డి అల్లాడుతున్నారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌స్తోంది. ఈ రోగానికి కావాల్సిన మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో కొంద‌రు మృత్యువాత ప‌డుతున్నారు. 

మ‌రికొంద‌రి కళ్లను తొల‌గించాల్సి వ‌స్తోంది. దీంతో కంటి చూపు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా బ్లాక్, వైట్ ఫంగ‌స్‌ల కంటే గ్రీన్ ఫంగ‌స్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తాజాగా వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

ఇండోర్‌లోని రూబీ ఆర్చర్డ్‌ రోడ్డులో నివ‌సిస్తున్న 34 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్నాడు. అయితే మ‌ళ్లీ కోవిడ్ ల‌క్ష‌ణాలు అత‌నిలో క‌నిపించాయి. దీంతో మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరాడు. అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు చేయగా.. ఊపిరితిత్తులు, సైనస్‌లో ఆస్పెర్‌గిలోసిస్ ఫంగస్‌ను గుర్తించిన‌ట్టు వైద్యులు తెలిపారు. ఉపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్‌ జరిగిందన్నారు.

ఈ నేప‌థ్యంలో అత‌న్ని మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అత‌ను హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఫంగస్ బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమని వైద్యులు పేర్కొన‌డం గ‌మనార్హం. గ్రీన్‌ ఫంగస్‌ ఊపిరితిత్తులకు వేగంగా సోకుతోందని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.