ఒకవైపు దేశం కరోనా భయాందోళనల్లో ఉంది. కరోనా భయాందోళనలు ఒకవైపు అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో అనేక రకాల పరిశ్రమలు చితికిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి వ్యాపారం నష్టాల్లో కూరుకుపోతోంది. చైనా వాడు తెచ్చిపెట్టిన ఈ ముప్పుతో ఇండియా వంటి దేశం అష్టకష్టాలు పడుతూ ఉంది. ఈ కష్టాలకు అంతెప్పుడో కూడా ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు. ఒకవైపు దేశంలో కరోనా నంబర్లు పెరుగుతూ పోతున్నాయి. ఈ భయాందోళనల మధ్యన రేపేమిటి? అనే ఆలోచనే ఇంకా అస్పష్టంగా ఉంది.
అయితే కొందరు రేపు ఎలా వ్యవహరించాలనే అంశం గురించి మాట్లాడగలుగుతున్నారు. వారిలో ఒకరిగా నిలుస్తోంది నటి కాజల్ అగర్వాల్. కరోనా పీడ విరగడ అయ్యాకా.. మనం దేశీయ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కాజల్ అభిప్రాయపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.
'మన హాలిడేస్ ను ఇండియాలోనే స్పెండ్ చేద్దాం, లోకల్ రెస్టారెంట్స్ లో తిందాం, స్థానికుల వద్దనే పండ్లూ, కూరగాయలను కొందాం, లోకల్ షాపుల్లో, లోకల్ బ్రాండ్ దుస్తులనే కొందాం.. ఇలా లోకల్ ఇండియా బిజినెస్ కు ఊతం ఇద్దాం.. ' అంటోంది కాజల్ అగర్వాల్. కరోనా వేళ చితికిపోతున్న భారతీయ పరిశ్రమను కరోనా తర్వాత ఇలా ప్రోత్సహిద్దామని కాజల్ పిలుపునిస్తోంది.
మంచి సందేశమే. ముందుగా ఇలాంటివి పాటించాల్సింది సినిమా వాళ్లే. ఫారెన్ హాలిడేస్, ఫారెన్ షూటింగ్స్ ను కూడా రద్దు చేసుకుని.. దేశీయంగానే అన్ని పనులనూ చేసుకుంటే.. మన పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది. మరి ఇప్పుడంటే ఏమైనా మాట్లాడతారు, తీరా స్వేచ్ఛ లభించాకా ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయా?