తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఇందుకు ట్విటర్ వేదికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని వీఆర్ఏలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
“ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్ పల్లిలో చెరకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలింది. కేసీఆర్‌కు భద్రాచలంలో వరద బాధితుల నిరసన తెలిసిందే. ఇక తండ్రి కొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇది” అని రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
కేటీఆర్‌ను ట్విటర్ పిట్టతో పోల్చాడు. వరుసగా ఆయనకు సెగ తగులుతోందని గుర్తు చేశారు. వచ్చే ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీలపై ఎప్పటికప్పుడు ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నారు.
టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే అని ప్రజల్లోకి సానుకూల సంకేతాలు తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి.