ఇప్పుడు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ టార్గెట్ గా మారింది నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2. థిక్కారమున్ సైతుమే అన్నట్లు వుంది పరిస్థితి. కార్తికేయ 2 విడుదల వ్యవహారం ఇలా వుంది. ఆ సినిమాను ముందుగా వేరే డేట్ లు అనుకున్నా, ఆఖరికి చాలా టైమ్ వుండగానే జూలై 22 అనుకున్నారు.
కానీ 22న డేట్ వేసుకుంటే అక్కడకు వేరే సినిమా వచ్చినా కార్తికేయ 2 జనాలు కిక్కురు మనలేదు. అయితే అక్కడి నుంచి వెనక్కు వెళ్లండి ఆగస్టు 5న వేసుకోండి. డేట్ అరేంజ్ చేస్తాం అంటే నమ్మారు. నిజానికి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ఆగస్టు 5న వుంది. అది వెనక్కు వెళ్లడం కష్టం అని తెలిసినా నమ్మి వెనక్కు తగ్గారు.
కానీ తీరా చేసి ఆగస్టు 5 రెండు సినిమాలు వుండడంతో, ముందు అనుకున్నట్లు బింబిసార వెనక్కు వెళ్లకపోవడంతో మరో డేట్ కోసం చూడాల్సి వచ్చింది. ఇక మిగిలింది. ఆగస్టు 12 మాత్రమే. మరో వారం వెనక్కు వెళ్తే పూరి జగన్నాధ్ లైగర్ తో సమస్య వుంది. అందుకే అనివార్యమైనా ఆగస్టు 12కు ఫిక్స్ అయ్యారు. దీంతో అన్ని వైపుల నుంచి వత్తిడి మొదలైంది. ఎందుకంటే నితిన్ మాచర్ల నియోజకవర్గం వుంది ఆ రోజు. సుధాకరరెడ్డి నిర్మాత. సితార నిర్మించిన స్వాతి ముత్యం వుంది. పైగా ఈ రెండు సినిమాలకు దిల్ రాజే నైజాంలో పంపిణీదారు.
ఇలాంటి నేపథ్యంలో కార్తికేయ 2 సినిమాను సింగిల్ పాయింట్ లో కొన్ని బయ్యర్ వెనకడుగు వేసారు. నిజానికి ఆంధ్ర, సీడెడ్, ఓవర్ సీస్ ఇచ్చేస్తే లాభదాయకమైన బేరమే. కానీ ఎందుకు వెనకడుగు వేసారో తెలియదు. దాని వెనుక కూడా పెద్దల వత్తిడి వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఓ తెరాస బడా నాయకుడు కూడా ఎంటర్ అయ్యారని, కార్తికేయ 2 పట్ల ఇలా చేయడం సరి కాదు అని ఇండస్ట్రీ పెద్దలు కొందరికీ ఫోన్ చేసి హెచ్చరించారని కూడా వినిపిస్తోంది. అబ్బే..తామేం అడ్డం పడడం లేదని చెప్పుకు వచ్చినా తెరవెనుక జరగాల్సినవి జరుగుతూనే వున్నాయని బోగట్టా. మొత్తానికి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా తయారైంది కార్తికేయ 2 పరిస్థితి.