ఇటు క్రిటిక్స్ వైపు నుంచి అటు సెలబ్రిటీల వైపు నుంచి జెర్సీ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. యుఎస్ లో మంచి ఫలితాలు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలే నమోదు చేసింది. కానీ జెర్సీకి వచ్చిన టాక్, వచ్చిన రేటింగ్ లు, విడుదలయిన థియేటర్ల సంఖ్య ఇవన్నీ చూసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు నమోదు చేసి వుండాల్సింది. ఇలా జరగకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
జెర్సీ ముందుగా అనుకున్న డేట్ వేరు. అయితే రకరకాల కారణాల వల్ల ఏప్రియల్ 19కి రావాల్సి వచ్చింది. అయితే అది సోలో డేట్ అనుకుంటే అనుకోకుండా కాంచన 3 వచ్చిపడింది. వాస్తవానికి కాంచన 3 మే 1న విడుదల కావాల్సి వుంది. అయితే తమిళనాట ఆ టైమ్ కు చాలా సినిమాలు వుండడంతో, నిర్మాతలయిన సన్ పిక్చర్స్ చటుక్కున డేట్ మార్చి ముందుకువచ్చారు. దాంతో ఇక్కడా అదే డేట్ ఫిక్స్ అయింది.
సరే, జోనర్ లు వేరు కదా? ఇది క్లాస్, అది మాస్ అని సరిపెట్టుకున్నారు. సమీక్షలు, రేటింగ్ లు ఎలావున్నా, కాంచన వన్, టూ పార్ట్ ల క్రేజ్ త్రీకి కలిసి వచ్చింది. అర్బన్ ఏరియాల్లో కూడా ఫస్ట్ వీకెండ్ జెర్సీ కలెక్షన్లకు కాంచన బ్రేక్ వేసినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి అర్బన్ ఏరియాల్లో జెర్సీ హవానే వుంటుంది, కాంచన 3 అంతగా వుండదు అనుకుంటే, అక్కడ కూడా ఫస్ట్ వీకెండ్ జెర్సీకి కాస్త తక్కువగానే అయినా కాంచన 3 గట్టిగానే వసూళ్లు చేసింది.
సీడెడ్ లో జెర్సీ సోలో రిలీజ్ అయివుంటే ఫలితం వేరేగా వుండేది. ఇప్పుడు సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో జెర్సీ కన్నా కాంచన 3నే డామినేట్ చేసింది. అయితే ఫస్ట్ వీకెండ్ తరువాత జెర్సీ స్టడీగా వుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ తరువాతనే మౌత్ టాక్ పనిచేస్తుందని, ఆ విషయంలో జెర్సీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.
జెర్సీ అయినా, కాంచన 3 అయినా ఫస్ట్ వీకెండ్ వేళకు దాదాపు 40 నుంచి 50శాతం రికవరీ సాధించాయి. అందువల్ల మిగిలిన రన్ లో ఆ మిగులు మొత్తంరావాలి. అయితే ఇక్కడ జెర్సీకి మళ్లీ అవెంజర్స్ రూపంలో సమస్య ఎదురవుతోంది. అవెంజర్స్ వస్తే మల్టీఫ్లెక్స్ లో షోలు తగ్గిపోయే ప్రమాదం వుంది. కాంచన 3కి అవెంజర్స్ తో సమస్య వుండదు. సి సెంటర్లలో కాంచన-3దే హవా అన్నట్లు వుంటుంది.
జెర్సీకి మాంచి మౌత్ టాక్ వుంది. అయితే ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం వుంది. హీరో నాని తన విక్రమ్ కుమార్ సినిమాలో బిజీగా వున్నారు. హీరోయిన్ బెంగుళూరులో వున్నారు. అందువల్ల గట్టిగా ప్రమోషన్లు చేయాలన్నా కుదరని పరిస్థితి కనిపిస్తోంది.
ఓవర్ సీస్ లో ఈ సమస్యలు ఏవీలేవు. అక్కడ కాంచన 3కి అవకాశంలేదు. అందువల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈవారం అంతా కలెక్షన్లు వుంటాయి. అవెంజర్స్ వస్తేనే చూడాలి, ఎలా వుంటుందో?