ప్రయోగం మంచిదే.. ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్?

పార్టీల తరఫున ఎన్నికల బరిలో దిగే నాయకులు.. డబ్బు వెదజల్లి గెలవడానికి ప్రయత్నిస్తుండవచ్చు గాక.. కానీ.. విజయం దక్కాలంటే మాత్రం.. క్షేత్రస్థాయిలో శ్రమకు వెరవకుండా, పార్టీ విజయం కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల…

పార్టీల తరఫున ఎన్నికల బరిలో దిగే నాయకులు.. డబ్బు వెదజల్లి గెలవడానికి ప్రయత్నిస్తుండవచ్చు గాక.. కానీ.. విజయం దక్కాలంటే మాత్రం.. క్షేత్రస్థాయిలో శ్రమకు వెరవకుండా, పార్టీ విజయం కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల మద్దతు చాలా అవసరం.

ప్రతి పార్టీ అధినేత కూడా ఇలా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉంటారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటారు. కానీ.. ఆ నాయకులు.. ఆయా కార్యకర్తలతో నిర్వహించే సమావేశాల్లో ఎలాంటి ధోరణిని అనుసరిస్తారు.. అనే దాని మీదనే ఆ పార్టీ భవిష్యత్తు, స్థితిగతులు, బలసంపదలు ఆధారపడి ఉంటుంటాయి.

ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది కార్యకర్తలతో తాను విడిగా భేటీ కావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ఇలాంటి సమావేశాలు జరుగుతాయి.

సాధారణంగా వైఎస్ జగన్ మీద పార్టీలో ఒక విమర్శ ఉంటుంది. ఆయన పార్టీ నాయకులకు ఎవ్వరికీ అందుబాటులో ఉండరని, సీనియర్ నాయకులకు, మంత్రులకు కూడా ఆయన అపాయింట్ మెంట్ దొరకడం దుర్లభం అని, పార్టీ బాగోగుల గురించి చర్చించడానికి కూడా ఆయనతో యాక్సెస్ ఉండదని.. కొందరు నాయకుల కోటరీ అన్ని వ్యవహారాలను నిర్ణయిస్తుంటుందని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి అన్ని రకాల ఆరోపణలను పటాపంచలు చేసేలా.. ముఖ్యమంత్రి జగన్ నేరుగా నియోజకవర్గస్థాయి కార్యకర్తలతోనే విడివిడిగా సమావేశం అవుతుండడం పార్టీకి చాలా మేలు చేస్తుంది.

అయితే ఈ రకం సమావేశాలు  ఇతర పార్టీలలో కూడా జరుగుతుంటాయి. నామమాత్రంగా కార్యకర్తల్ని సమావేశానికి ఆహ్వానిస్తారే తప్ప.. వారికి తమ గళం వినిపించడానికి, పార్టీ పరంగా తమ సమస్యలు చెప్పడానికి అవకాశం మాత్రం ఇవ్వరు. అధినాయకులు తాము చెప్పదలచుకున్నది చెప్పేసి, ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా తాము నియమించిన వారికి మద్దతు  ఇవ్వాలని హుకుం జారీ చేసేసి అంతటితో మమ అనిపిస్తారు. అదే రీతిగా.. నిర్వహించేట్లయితే.. వైఎస్ జగన్ ఇలాంటి సమావేశాలు పెట్టడం కూడా దండగ. 

క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు స్థానికంగా ఏం జరుగుతోందనే విషయంపై చాలా అవగాహన ఉంటుంది. అక్కడి ఎమ్మెల్యేలు, లేదా పార్టీ ఇన్చార్జిలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నదనే విషయంలో కూడా వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.

అయితే వారు చెప్పదలచుకున్నది వినిపించుకోకుండా.. పిలిచి భోజనాలు పెట్టి పంపించేస్తాం అంటే ఏమీ ఉపయోగం లేదు. ఇతర పార్టీలకు భిన్నంగా తమ సమావేశాలు ఉండాలనుకుంటే.. వారి గళం వినాలి. వారి సమస్యలు వినాలి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. పార్టీ పట్ల వారిలో ఉండే ప్రేమను, కమిట్ మెంట్ ను కాపాడాలి. జగన్ అలా చేయగలిగితేనే.. ఇలా నిర్వహించే సమావేశాలకు సార్థకత.

ముఖ్యమంత్రి అంటే.. ఆయన సమయం ఎంతో విలువైనది. ప్రభుత్వ పరంగా, పాలన పరంగా ఎంతెంతో పనుల ఒత్తిడి ఉంటుంది. వీటన్నింటి మధ్య ప్రతి నియోజకవర్గం నుంచి 50 మందితో 175 సమావేశాలు అంటే.. చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం.

చంద్రబాబు లాంటి పనిలేని మాజీ నాయకులు కూడా.. కొన్ని నియోజ.కవర్గాల వారితో కలిపి ఒకే సమావేశం పెట్టి మమ అనిపిస్తున్నారు. అలాంటిది సీఎం జగన్.. ప్రతి సెగ్మెంటు వారితోనూ సమావేశం అవుతున్నందుకు సరైన ఫలితం దక్కాలంటే.. ఎన్నికలకు శ్రేణులు పక్కాగా సిద్ధం కావాలంటే.. వచ్చే వారికి విలువ ఇచ్చి అభిప్రాయాలు తెలుసుకుంటేనే సాధ్యం!