తెలుగుదేశం పార్టీ, వారి అధినేత చంద్రబాబునాయుడు.. తమ పార్టీ నాయకులందరికీ యూనివర్సల్ గా ఒకటే పాఠం నేర్పినట్టుగా ఉంది. తమ హవా సాగిన రోజుల్లో ఎడాపెడా కోట్లకు కోట్లు కాజేయడం.. తీరా ఇప్పుడు వారి బాగోతాలన్నీ బయటకు వస్తూన్న రోజుల్లో విచారణకు పోలీసులు వస్తే.. దొంగ నాటకాలు ఆడడం. పోలీసులకు చట్టానికి దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం, పారిపోవడం.. ఒకవేళ పట్టుబడితే.. ప్రతిపక్షానికి చెందిన నాయకులు గనుక తమ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సిగ్గు మాలిన రీతిలో రాజకీయం చేయడం. ఇదొక్కటే వ్యవహారం నడుస్తోంది.
తెలుగుదేశం నాయకులు.. తాము చేసిన పాపాలు బయటకు వచ్చినప్పుడు ఆడే నాటకాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. కొన్ని చట్టాలను అడ్డు పెట్టుకుని న్యాయస్థానానికి వెళ్లి, ముందుగానే కొన్ని ఉత్తర్వులు తెచ్చుుకోవడం.. తమ తప్పులకు జైలు పాలు కాకుండా జాగ్రత్త పడడం. రెండు- తీరా తమ పన్నాగాలు ఫలించక, అరెస్టు అయ్యే దాకా వస్తే.. తమ పార్టీకి చెందిన జనాన్నంతా పోగేసి తమకు వ్యతిరేకంగా పోలీసులు చాలా చాలా అన్యాయం చేసేస్తున్నారంటూ వారితో నానా యాగీ చేయించడం వారు ఎంచుకున్న వక్రమార్గాలు.
ఈ రెండు మార్గాలను అనుసరించడంలో.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి.. అత్యంత కిందిస్థాయి కార్యకర్తల వరకు అందరిదీ ఒకటే తీరు. ఒకటే టెక్నిక్. అయితే.. తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడు.. తాజాగా మరో సరికొత్త టెక్నిక్ ను పార్టీకి పరిచయం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జి వరుపుల రాజా.. పోలీసులకు దొరకకుండా పారిపోయారు!
ఒక స్థాయి నాయకుడుగా ఉంటూ ఈ ‘పారిపోవడం’ ఏమిటా అని అనుకుంటున్నారా? అవును నిజమే! ఆయన పారిపోయారు. తన అవినీతి బాగోతాల మీద కేసులు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు, తన ఇంటికి అరెస్టు చేయడానికి వస్తే.. ఇంటి లోపలకు వెళ్లి.. తలుపులు బిడాయించుకున్న సదరు వరుపుల రాజా.. అటునుంచి అటే గాయబ్ అయిపోయారు.
ఈ రాజా అనే నాయకుడు..తెలుగుదేశం జమానాలో డీసీసీబీ అధ్యక్షుడిగా పదవి వెలగబెట్టారు. కోట్లకు కోట్ల రూపాయలకు బినామీ లోన్ల రూపేణా కాజేశారని ఆరోపణలున్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు నుంచి రక్షణ కవచం తెచ్చుకున్నారు. కానీ.. మరికొన్ని కేసులు మెడకు బిగుసుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్న రాజా అటునుంచి అటే పారిపోయారు. రాత్రి దాకా పోలీసులు అక్కడే ఉండి, వారి కుటుంబసభ్యులు తలుపు తెరిచాక, ఆయన ఇంట్లో లేకపోవడం చూసి అవాక్కయ్యారు. ఇది ఆయన కనిపెట్టిన కొత్త పలాయనమంత్రం అన్నమాట.
ఇలాంటి దొంగపనులు చేసే నాయకులు దొంగ మార్గాలు ఎంచుకుని, దొంగచాటుగా పారిపోతూ ఉంటే.. పోలీసులు విడిచిపెడతారా? తర్వాత అయినా పట్టుకుని తీరుతాం అంటూ హెచ్చరించారు. అయితే.. పారిపోయిన తర్వాత సదరు తెలుగుదేశం నాయకుడు.. యథోరీతిలో.. ప్రభుత్వం తన మీద కక్ష కట్టిందంటూ ఓ ప్రకటనతో వీడియో విడుదల చేయడం విశేషం.
కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అని వారు ఎప్పటికి తెలుసుకుంటారు.