వీళ్లలో ఈ లుకలుకలే కదా.. వారికి బలం!

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం నిజంగా అంత తిరుగులేనీ రీతిలో అప్రతిహతంగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నదా? ఏ ఎన్నికలోనూ పరాజయం అవకాశమేలేకుండా దూసుకుపోతుండడానికి ప్రధాని మోడీ నాయకత్వ పటిమ ఒక్కటే కారణమా? భారతదేశపు వర్తమాన రాజకీయంలో..…

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం నిజంగా అంత తిరుగులేనీ రీతిలో అప్రతిహతంగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నదా? ఏ ఎన్నికలోనూ పరాజయం అవకాశమేలేకుండా దూసుకుపోతుండడానికి ప్రధాని మోడీ నాయకత్వ పటిమ ఒక్కటే కారణమా? భారతదేశపు వర్తమాన రాజకీయంలో.. ‘‘మోడీ ది అన్‌బీటబుల్’’గా తయారవుతున్నారా? అనే ప్రశ్నలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. అయితే.. ఇందుకు ఏకపక్షంగా అవుననే సమాధానం మాత్రం చెప్పలేం. ఎందుకంటే.. ప్రతిపక్షాల అనైక్యతే ప్రధాని నరేంద్రమోడీకి ప్రధానమైన బలం! ఆ బలంతోనే వారు చెలరేగిపోతున్నారు.

ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా.. ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యత మరోమారు బయటపడింది. ఒకరిని ఒకరు సమర్థించుకోలేదు.. ఏవేవో కారణాలు చూపించుకుంటున్నారు. పైగా.. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో కూడా ఐక్యంగా నడవడానికి ప్రతిబంధకం అవుతాయి. 

తాజా పరిణామాలను గమనిస్తే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా.. కాంగ్రెస్ కు చెందిన మార్గరెట్ ఆల్వాను ప్రకటించారు. అయితే విపక్షాలు ఉమ్మడిగా తమ బలం చూపించుకోవాల్సిన తరుణంలో.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. ఈ ఎన్నికకు దూరంగా ఉంటాం అని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. 

కనీసం ఈ వ్యవహారం ఇక్కడితో ఆగినా సరిపోయేది. అది చాలదన్నట్టుగా.. మార్గరెట్ ఆల్వా.. మమతాదీదీపై విమర్శలు గుప్పించి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చారు. అహం, కోపం ప్రదర్శించాల్సిన సమయం ఇది కాదంటూ.. ఆళ్వా చేసిన విమర్శలు దీదీని మరింత రెచ్చగొట్టేవే తప్ప ఫలితమిచ్చేవి కాదు.

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా విపక్షాలు ఐక్యంగా ఉండలేకపోయాయి. ద్రౌపది కి పోటీగా.. యశ్వంత్ కు అందరూ ఉమ్మడిగా అండగా నిలవలేకపోయారు. ఆయనకు మద్దతిచ్చినప్పటికీ.. ప్రారంభంలో.. అభ్యర్థి ఎంపిక కోసం దీదీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించినందుకు గాను.. కేసీఆర్ డుమ్మా కొట్టి తమ అనైక్యతను చాటి చెప్పారు. తీరా యశ్వంత్ బరిలోకి దిగిన తర్వాత.. జెఎంఎం లాంటి పార్టీలు, కాంగ్రెస్ తో పొత్తుల్లో మహావికాస్ ఆఘాడీలో ఉన్న శివసేన లాంటి వారు కూడా హ్యాండిచ్చారు. 

ద్రౌపది మీద గెలుపు సాధ్యం కానే కాదని ముందునుంచి అందరూ అనుకున్నదే గానీ.. ఈ రకమైన అనైక్యత కారణంగా..  విపక్షాల అభ్యర్థి మరీ ఘోరంగా ఓడిపోయారు. వారి బలహీనత అధికార పార్టీకి బలమైంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా అదే జరుగుతోంది. ఈ అనైక్యత భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందనడానికి ఇది సంకేతం. వీరి అనైక్యతను సోపానాలుగా మార్చుకుంటూ మోడీ సర్కారు మాత్రం యథేచ్ఛగా వర్ధిల్లుతోంది.