మంత్రి రోజా ఫైర్ అవుతున్నారు. నిత్యం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై విరుచుకుపడే రోజా…ఈ దఫా మాత్రం తన పార్టీ వాళ్లపైనే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో అధికార పార్టీలోని వర్గ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఇందుకు నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం ఈసలాపురం పరిధిలోని కొత్త క్వారీల ప్రతిపాదన కారణమైంది.
ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా కొత్త క్వారీలకు ఎలా శ్రీకారం చుడతారని ఆమె అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈసలాపురం రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 6లో 750 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములున్నాయి. ఇక్కడ నాలుగు క్వారీలున్నాయి. మరో ఐదు క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వెళ్లాయి.
పదెకరాలకు ఒక క్వారీ ఇవ్వాలనేది ప్రతిపాదన. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజా వ్యతిరేక వర్గీయులు నాయకత్వం వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారికి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన బలమైన నేత అండదండలున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రోజా వర్గానికి చెందిన పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు ఇప్పటికే కొత్త క్వారీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి తమ వ్యతిరేకతను బహిరంగంగానే ప్రకటించారు. ఇదే సందర్భంలో క్వారీల విషయమై రోజా నేరుగా రంగంలోకి దిగారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా కొత్త క్వారీలను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించినట్టు సమాచారం.
ఈసలాపురం గ్రామాన్ని పుత్తూరు మున్సిపాలిటీలో కలిపారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాయకుండా ఈసలాపురం పంచాయతీ కార్యదర్శి పేరిట ఎలా రాస్తారని కలెక్టర్‌ను ఆమె ప్రశ్నించినట్టు సమాచారం. ఈ క్వారీల వెనుక అధికార పార్టీ నేతలున్నారనేది స్పష్టం. వీరిలో వ్యతిరేకించే వర్గానికి రోజా, కావాలనే వర్గానికి ఆమె వ్యతిరేక వర్గీయులు నాయకత్వం వహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. చివరికి ఈ వ్యవహారం నగరి నియోజకవర్గంలో ఏ మలుపు తీసుకుంటుందో అనే చర్చ జరుగుతోంది.