ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రిటైర్డ్ ఐపీఎస్ మన్నెం నాగేశ్వరరావు సలహా ఒక్కటే తక్కువైంది. రిటైర్డ్ తర్వాత పనేమీ లేక కొత్తకొత్త ఐడియాలు ఆయన మనసులో మెదలుతున్నట్టున్నాయి. తాజాగా ట్విటర్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం కోనసీమకు అంబేద్కర్ పేరు తీవ్ర వివాదం అయిన నేపథ్యంలో నాగేశ్వరరావు వెటకారం చర్చనీయాంశమైంది.
‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును ‘వైఎస్సార్ ప్రదేశ్’ గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. మరో మాట: తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి ‘YSR Land’ అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది’ అని ట్వీట్ చేశారాయన.
ఇటీవల ఈయనగారి చైతన్యానికి మెచ్చిన ఢిల్లీ హైకోర్టు అక్షరాలా రూ.10 వేలు జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసుకోవడం మంచిది. తెలంగాణకు చెందిన ఈయన గతంలో సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా కొంత కాలం పని చేశారు. వార్తల్లో కనిపించాలన్న ఉత్సాహమో, మరే కారణమో తెలియదు కానీ, అనుకున్నది సాధించారు.
తన ట్విటర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా సదరు సోషల్ మీడియా దిగ్గజ సంస్థను ఆదేశించాలని కోరుతూ గతంలో నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ తనకు ఫలితం దక్కలేదంటూ మరోమారు ఇదే అంశంపై ఈ మధ్యే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఒకే అంశంపై వరుసగా రెండు సార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నాగేశ్వరరావుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు…ఆయనకు రూ.10వేల జరిమానా విధించింది. పిటిషనర్ పనిలేక ఖాళీగా ఉన్నట్టుందని ఘాటు వ్యాఖ్య చేసింది. అర్థమైందా మన రిటైర్డ్ ఐపీఎస్ పరపతి.