ఈసారి కూడా చినబాబుకు సింహాసనం దూరమే!

చంద్రబాబు అనుకున్నట్టే అన్నీ జరిగి ఉంటే, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే.. లోకేష్ కి పట్టాభిషేకం జరిగి ఉండేది. కచ్చితంగా చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయేవారు, కాదు కూడదు అనుకుంటే నేషనల్…

చంద్రబాబు అనుకున్నట్టే అన్నీ జరిగి ఉంటే, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే.. లోకేష్ కి పట్టాభిషేకం జరిగి ఉండేది. కచ్చితంగా చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయేవారు, కాదు కూడదు అనుకుంటే నేషనల్ పాలిటిక్స్ లో వేలు పెట్టి కెలికేవారు.. కానీ అదంత వీజీ కాదనే విషయం తండ్రీ కొడుకులిద్దరికీ అర్థమైపోయింది. 

తాను పోటీ చేసిన నియోజకవర్గంలో గెలిచే సత్తా లేని కొడుకు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఎలా నడపగలరనే భయం బాబుకి పట్టుకుంది. అందుకే పార్టీ పగ్గాలు ఇంకా తన చేతిలోనే పెట్టుకున్నారు బాబు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి రెండేళ్లయినా, టీడీపీలో పగ్గాల మార్పిడి ప్రక్రియ మాత్రం జరగలేదు. జరుగుతుందన్న ఆశ కూడా లోకేష్ కు లేదు.

అధికారం దూరమైనా, కనీసం చెప్పుకోదగ్గ సీట్లు గెలిచి, మంగళగిరిలో చినబాబు గెలిచి, అంతా సవ్యంగా సాగితే ఈ పాటికే లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించేవారు చంద్రబాబు. వచ్చే దఫా లోకేష్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారు. కానీ ఘోర పరాభవం బాబుని డైలమాలో పడేసింది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ కి పార్టీని అప్పగించడమంటే.. నిలువునా ముంచేయడమే. అందుకే బాబు ఈసారి కూడా కొడుకుని వెనక్కు నెట్టి, తానే ముందుండి యుద్ధం చేయాలనుకుంటున్నారు.

ఇటీవల బాలకృష్ణ కూడా టీడీపీ అధినాయకత్వంపై తేల్చేశారు. ఇప్పట్లో నాయకత్వ మార్పు ఉండదని, ఉంటే తాను కూడా అర్హుడినేనన్నారు. దీంతో చంద్రబాబు మినహా టీడీపీకి వేరే గత్యంతరం లేదని ఆ పార్టీనేతలే ఒప్పుకున్నట్టయింది.

చావు ముంగిట అప్పగిస్తారా..? పూర్తిగా చంపేసి ఇస్తారా..?

ఎన్నికల ముందు టీడీపీని లోకేష్ కి అప్పగిస్తే.. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ ని కొత్త డాక్టర్ చేతిలో పెట్టినట్టే లెక్క. ఎన్నికలయ్యాక అప్పగిస్తే.. చచ్చిపోయిన పార్టీని కాటికాపరి చేతిలో పెట్టినట్టు. ఈ రెండిటిలో ఏది చేయాలా అని ఆలోచిస్తున్న చంద్రబాబు, లోకేష్ కి డాక్టర్ పోస్ట్ కంటే కాటికాపరి పోస్టే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. అందుకే ఈసారి కూడా లోకేష్ ని దూరం పెట్టబోతున్నారు.

అధికారం ఉన్నప్పుడు ఎన్ని ఆటలాడినా పట్టించుకునేవారు ఉండరు. అందుకే దొడ్డిదారిన కొడుకుని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు చంద్రబాబు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో.. లోకేష్ సామర్థ్యంపై ఉన్న సందేహాలపై మాట్లాడేందుకు అందరూ ముందుకొస్తారు. 

ఆమధ్య తిరుపతి హోటల్ లో అచ్చెన్నాయుడు కూడా ఇలాగే మాట్లాడారు. అంటే లోకేష్ కి పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. టీడీపీని వదిలిపెట్టి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ భయంతోనే బాబు వృద్ధాప్యంలో కూడా కష్టాలు పడుతున్నారు. మిగులు జనాలతో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలనుకుంటున్నారు.

అంటే చినబాబు పర్సనాల్టీ తగ్గించి, గడ్డం పెంచి స్టైల్ మార్చినా.. అదృష్టం మాత్రం మారలేదనమాట. పార్టీపై పెత్తనం ఇప్పుడల్లా దక్కేది లేదనమాట. 2024 ఎన్నికల తర్వాత రాజెవరో.. లోకేష్ ఎవరో!