జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఇది స‌బ‌బా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంగ్లీష్‌పై త‌న మోజును అంద‌రిపై బ‌ల‌వంతంగా రుద్దుతున్నారు. ఈ వైఖ‌రి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇప్ప‌టికే ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెడుతూ తీసుకున్న…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంగ్లీష్‌పై త‌న మోజును అంద‌రిపై బ‌ల‌వంతంగా రుద్దుతున్నారు. ఈ వైఖ‌రి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇప్ప‌టికే ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెడుతూ తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆంగ్ల మాధ్య‌మానికి సంబంధించి ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోలు న్యాయ‌స్థానాల్లో కొట్టివేత‌కు గుర‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టులో న‌డుస్తోంది.

తాజాగా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం డిగ్రీ విద్యార్థుల పాలిట పిడుగుపాటైంది. ఒక్క‌సారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డిగ్రీ క‌ళాశాల‌ల్లో 2021-22 విద్యా సంవ‌త్స‌రం నుంచి తెలుగు మాధ్య‌మాన్ని మూసేస్తూ, పూర్తిగా ఇంగ్లీష్ మ‌యం చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఇక మీద‌ట డిగ్రీలో తెలుగు ఊసే వినిపించ‌దు. 

డిగ్రీ క‌ళాశాల‌ల‌న్నీ ఆంగ్ల మాధ్య‌మంలోకి మారాల్సిన దుస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు  డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించనున్న‌ట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించ‌డం గ‌మ‌నార్హం.

నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆంగ్లంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు స్ప‌ష్టం చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మాధ్యమం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని హెచ్చ‌రించింది.

ఏ మీడియంలో చ‌ద‌వాలో విద్యార్థుల వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే చ‌ద‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్బంధించ‌డంపై విద్యార్థులు, త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం వ‌ల్ల తెలుగు మీడియంలో చ‌దువుతున్న 65,981 మంది విద్యార్థుల ప‌రిస్థితి అగ‌మ్య‌మైంది. 

ప్ర‌భుత్వం క‌నీసం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌ల అభిప్రాయాలు తీసుకోకుండా, త‌న‌కు తానుగా తెలుగు మాధ్య‌మం ఎత్తివేసే పెద్ద నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌గ‌న్ స‌ర్కార్‌కు స‌బ‌బా అని ప్ర‌జాస్వామిక‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌త ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,336 డిగ్రీ క‌ళాశాల‌ల్లో 2.60 ల‌క్ష‌ల మంది విద్యార్థులు చేరారు. వీరిలో 65,981 మంది విద్యార్థులు చేరారు. మిగిలిన వాళ్లంగా త‌మ‌కిష్ట‌మైన ఇంగ్లీష్ మీడియంలో అడ్మిష‌న్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా విద్యార్థుల ఇష్టానికి మాధ్యమాన్ని వ‌దిలి పెడితే జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంట‌ని విద్యావేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. డిగ్రీ విద్యార్థుల‌పై ఆంగ్ల మాధ్య‌మం క‌త్తి పెట్ట‌డం ఏంట‌నే నిల‌దీత‌లు వెల్లువెత్తుతున్నాయి.

చిన్న‌ప్ప‌టి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌ను ఒక్క‌సారిగా ఆంగ్ల మాధ్య‌మంలో చ‌ద‌వ‌మంటే ఎలా అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈతే రాని వాడిని స‌ముద్రంలో విసిరేసి ఈత కొట్టాల‌ని బ‌ల‌వంతం చేసిన‌ట్టుగా ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం ఉంద‌నే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్ అన‌వ‌స‌ర స‌మ‌స్య‌లు సృష్టిస్తోంద‌నే అభిప్రాయాలు త‌లెత్తుతున్నాయి.