ఇండియాలో త్వరలో మరో వ్యాక్సిన్ లాంచ్ కాబోతోందనే వార్తలు వస్తున్నయి. ఇప్పటికే కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్, స్ఫూత్నిక్ వంటి వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే దేశీయ అవసరాలకు తగ్గట్టుగా మాత్రం వీటి ప్రొడక్టివిటీ లేదు. ఇప్పుడప్పుడే అది పెంపొందే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఆగస్టు ఒకటి నుంచి దేశంలో రోజుకు కోటి వ్యాక్సిన్ల చొప్పున అందుబాటులోకి వస్తాయంటూ ఇది వరకూ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికైతే దేశంలో రెండో డోసుల వ్యాక్సినేషన్ పొందిన జనాభా చాలా చాలా తక్కువగానే ఉంది. కనీసం ఐదు శాతాన్ని కూడా మించలేదు. అయితే ఒక డోసు వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
మరోవైపు వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మాత్రం మెరగవుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ బేస్డ్ మరో దేశీయ వ్యాక్సిన్ పై కేంద్రం ఆశలు పెట్టుకుంది. బయోలాజికల్-ఇ వ్యాక్సిన్ దాదాపు ముప్పై కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని, ఈ ఏడాది చివరకు ముప్పై కోట్ల డోసులు ఇవి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
ఇక మరో విదేశీ వ్యాక్సిన్ కు కూడా త్వరలోనే ఇండియాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొవవ్యాక్స్ పేరుతో ఈ టీకాను అందుబాటులోకి తీసుకున్నారట ఇండియాలో. దీన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనున్నట్టుగా సమాచారం. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నదని, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ నంబర్ మరింత పెరగవచ్చని కూడా అంచనా.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉందని తెలుస్తోంది. యూఎస్, మెక్సికోల్లో దాదాపు 30 వేల మంది మీద ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారట. చాలా సానుకూల ఫలితాలు ఉన్నాయని, ఈ వ్యాక్సిన్ 90 శాతం వరకూ ప్రభావితం అని అంటున్నారు. ఫైజర్, మోడెర్నాలకు ధీటుగా పని చేస్తుందట ఈ వ్యాక్సిన్.