తను మోడీకి హనుమంతుడి లాంటి వాడినంటూ చెప్పుకున్న చిరాగ్ పాశ్వాన్.. రాజకీయ కీలక దశలో చిత్తయ్యాడు. బీజేపీ ఆటలో పావుగా మారాడనిపించుకున్న రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు ఇప్పుడు ఒంటరయ్యాడు.
ఇప్పుడు చిరాగ్ ను బీజేపీ రక్షిస్తుందా? అతడి పార్టీ ఎంపీలను అతడి వెంట ఉండమంటూ గద్దిస్తుందా లేక.. తన మానన తనను వదిలేస్తుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎన్నో డక్కామొక్కీలు తిన్న నితీష్ కుమార్ తో పెట్టుకోవడం చిరాగ్ చేసిన పెద్ద పొరపాటులాగుంది. అవకాశం చూసి నితీష్ ఇచ్చిన ఝలక్ తో ఇప్పుడు చిరాగ్ ఒంటరయ్యాడని స్పష్టం అవుతోంది.
ఎంతలా అంటే.. తనపై తిరుగుబాటు చేసిన తన బాబాయ్ తో సమావేశం కోసం చిరాగ్ పాశ్వాన్ గంటల కొద్దీ వెయిట్ చేసిన ప్రయోజనం లేకపోయిందట. తిరుగుబాటు చేసిన వారి ఇంటికి వెళ్లి చిరాగ్ వారిని బతిమాలుకునే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నాడు.
నాయకత్వ స్థాయిలో ఉన్న చిరాగ్ వారిని పిలిపించుకునే మాట్లాడే దశను దాటిపోయి, వారి ఇంటి ముందే వెయిట్ చేసినా వారు కనికరించలేదట. చిరాగ్ తో సమావేశానికి పశుపతి పరాస్ ఏ మాత్రం ఆసక్తి చూపలేదట. మరోవైపు అసలు ఎల్జేపీ తమదేనంటూ.. ఎంపీలు ఎన్నికల కమిషనర్ ను కలవనున్నారట. ఎల్జేపీని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు వారు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఎంపీలు అంతా అటే వెళ్లిపోవడం, ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఎప్పుడో జేడీయూ వైపు మొగ్గడం, ఎమ్మెల్సీ బీజేపీలోకి చేరిపోవడంతో.. చిరాగ్ ఇప్పుడు పూర్తిగా ఒంటరయ్యాడు. అతడి చేతుల నుంచి పార్టీ చేజారిపోవడం లాంఛనమే అని స్పష్టం అవుతోంది.
తండ్రి మరణాంతరం చిరాగ్ చేసిన తొలి పొరపాటు.. ఒంటరిగా పోటీ చేయడం. అలా చేసే వ్యక్తి అటు బీజేపీతో అయినా తెగదెంపులు చేసుకున్నాడా, అంటే అదేం లేదు. బీజేపీతో దోస్తీ, జేడీయూతో కుస్తీ అంటూ.. చిరాగ్ రాజకీయం అడ్డదారి తొక్కింది. అసలు ఆ ఆటనే బీజేపీ ఆడించిందనే విశ్లేషణలున్నాయి.
నితీష్ ను దెబ్బతీయడానికి చిరాగ్ ను బీజేపీ పావుగా వాడిందని, ఆ దెబ్బకు జేడీయూకు చాలా సీట్లు చేజారాయనే విశ్లేషణలు బిహార్ ఎన్నికల ఫలితాల సమయంలో వినిపించాయి. అయితే అదే నితీష్ ను బీజేపీ సీఎంగా చేయక తప్పలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తితో శత్రువుగా, బీజేపీకి మిత్రుడిగా చిరాగ్ ప్రస్థానం ఇప్పుడు ఇరకాటంలో పడింది.
చిరాగ్ వెంట ఉన్న ఎంపీలతో సత్సంబంధాలను నెరిపి, ఇప్పుడు నితీష్ ఝలక్ ఇచ్చాడని, చిరాగ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే తరుణంలో.. ఈ తిరుగుబాటు లేవడం వెనుక పూర్తిగా నితీష్ హస్తం ఉందనే మాట వినిపిస్తోంది. అటు సొంతంగా ఎమ్మెల్యేలనూ గెలవలేకపోవడం, ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే మొదట్లోనే చిరాగ్ కు దూరం కావడంతో, ఇప్పుడు ఐదుగురు ఎంపీలూ ఒకే జట్టుగా ఏర్పడటంతో ఎల్జేపీ పై చిరాగ్ కు పూర్తిగా పట్టు తప్పనుంది.
మరి ఈ పరిణామాలపై బీజేపీ స్పందించడం లేదు. అంతర్గత వ్యవహారం అన్నట్టుగా కామ్ గా ఉన్నట్టుంది. తిరుగుబాటు ఎంపీలంతా తాము ఎన్డీయేలో ఉంటామంటున్నారట. కాబట్టి వారిని బీజేపీ గద్దించలేదు. స్థూలంగా బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ లో పావుగా వాడబడి ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరయ్యాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో.