పశ్చిమ బెంగాల్ లో పోస్ట్ పోల్ వయోలెన్స్ పై బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది! ఈ విషయంపై స్వయంగా ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఇప్పటికే స్పందించారు. ఎన్నికల అనంతర హింస బాధితులను కూడా ఆయన పరామర్శించిన వార్తలు వచ్చాయి.
ఇలా ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నట్టుగా ఉన్నారు ఆ రాష్ట్ర గవర్నర్. ఆ సంగతలా ఉంటే.. బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ విభాగం అధ్యక్షుడు సువేందు అధికారి ఇదే విషయమై గవర్నర్ తో సమావేశం అయ్యారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి అధికారి గవర్నర్ కు ఎన్నికలానంతర హింస గురించి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే గవర్నర్ స్పందించిన అంశం గురించి, చాలా లేటుగా ప్రధాన ప్రతిపక్ష నేత వెళ్లి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కన్నా.. గవర్నరే చాలా వేగంగా స్పందిస్తున్నట్టుగా ఉన్నారక్కడ.
ఆ సంగతలా ఉంటే.. అధికారి వెంట చాలా మంది ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని స్కిప్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. వీరంతా ముకుల్ రాయ్ కు సన్నిహితులు అనే టాక్ కూడా వినిపిస్తోంది. బెంగాల్ లో బీజేపీ 74 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అయితే వీరిలో ఇప్పుడు అధికారి వెంట గవర్నర్ ను కలవడానికి వెళ్లింది 50 మంది మాత్రమేనట.
ఎమ్మెల్యేలందరినీ వెంట పెట్టుకుని ఎన్నికలానంతర హింస గురించి హైలెట్ చేయాలని అధికారి భావించగా, ఇలా మూడో వంతు ఎమ్మెల్యేలు ఆయనకు హ్యాండ్ ఇచ్చారనే కథనాలు వస్తున్నాయి మీడియాలో.
బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు చాలా మంది టీఎంసీ వైపు చూస్తున్నారని, ఇప్పటికే వెళ్లిపోయిన నేతలను కొందరు బీజేపీలోని ఎమ్మెల్యేలు బాహాటంగా సమర్థిస్తూ ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు గవర్నర్ తో సమావేశానికి మూడో వంతు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో.. అక్కడ కమలం పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టో, మరెంత మంది ఆ పార్టీకి దూరం అవుతున్నట్టో అనే అంశంపై తీవ్ర చర్చ మొదలైంది.