కమర్షియల్ ఆనందయ్య.. ఉచిత మందేదయ్యా..?

ఒకప్పుడు కృష్ణపట్నంలో ఉచితంగా దొరికే ఆనందయ్య మందు, ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి, ముందుగా ఆర్డర్ ఇచ్చి ఆనందయ్య…

ఒకప్పుడు కృష్ణపట్నంలో ఉచితంగా దొరికే ఆనందయ్య మందు, ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి, ముందుగా ఆర్డర్ ఇచ్చి ఆనందయ్య దగ్గర మందు తయారు చేయించుకుని తీసుకెళ్తున్నారు. తమ బంధువులకు, తెలిసినవారికి, నియోజకవర్గం జనాలకు అమ్ముకుంటున్నారు. దీంతో సహజంగానే ఆనందయ్యపై విమర్శలు మొదలయ్యాయి.

మరోవైపు కృష్ణపట్నం వచ్చే పేద రోగులకు మాత్రం ఉచిత మందు అందుబాటులోకి రావడంలేదు. చాలామంది ఆనందయ్య సొంత ఊరు వచ్చి వట్టి చేతుల్తో తిరిగెళ్లిపోతున్న సందర్భాలున్నాయి, లేదా రోజుల తరబడి వేచి చూస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మహిళ, ఉచిత మందు కోసం వచ్చి విసిగి వేసారి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆనందయ్య మందు ఉచితంగా లభించడంలేదని ఆమె వాపోయింది.

గతంలో ఆనందయ్య మందు తయారీ ఆపేసిన తర్వాత బ్లాక్ లో ఆ మందుని చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన మందు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కూడా బ్లాక్ మార్కెట్ ఆగలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అంతమాత్రానికి ప్రభుత్వం అనుమతి అవసరమా..?

ఆనందయ్య తన మందుతో ప్రైవేటుగా వ్యాపారం చేసుకునేట్టయితే దానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఎందుకు, హైకోర్టు జోక్యం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆనందయ్య మందు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు సగటు ప్రజలు. 

ఆన్ లైన్ అన్నారు, వెబ్ సైట్ లో ఆర్డర్ ఇస్తే, ఇంటికొస్తుందన్నారు, జిల్లాలవారీగా కౌంటర్లు పెడుతున్నామన్నారు. అన్నీ బాగానే ఉన్నా.. ఇప్పటి వరకూ ఆనందయ్య మందు కేవలం కొంతమంది కోసం మాత్రమే తయారు చేస్తున్నారు. కనీసం కృష్ణపట్నంలో కూడా ఉచితంగా మందు అందుబాటులో లేకపోవడం విచిత్రం.

అలాంటిదేం లేదంటున్న ఎమ్మెల్యే

ఆనందయ్య మందు అంతగా పాపులర్ కావడానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఒక కారణం. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని మందుని ఉచితంగా ఇంటింటికీ పంపిణీ చేశారు. అయితే మిగతా ప్రజల విషయంలో ఎవరు పట్టించుకోవాలనే విషయమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. 

ఆనందయ్య మందు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని, ఉచితంగా అందడంలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు కాకాణి. ఆనందయ్య సహాయం కోరితే జిల్లా కలెక్టర్ సహకరించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

ఆనందయ్య రెడీ, కలెక్టర్ రెడీ, ప్రభుత్వం రెడీ.. అందరూ రెడీగా ఉన్నా.. ప్రభుత్వం అనుమతిచ్చి ఇన్నిరోజులవుతున్నా.. ఆనందయ్య మందు ఉచిత పంపిణీ అధికారికంగా ఇంకా ఎందుకు మొదలు కాలేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.