రామ్ విలాస్ పాశ్వాన్ మరణానంతరం లోక్ జనశక్తి పార్టీ పగ్గాలను ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ బీజేపీ కూటమితో సంబంధం లేకుండా పోటీ చేసింది. ఒకవైపు కేంద్రంలో ఎన్డీయేలో ఉంటూనే.. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసింది.
ఒకవైపు బీజేపీని ప్రశంసిస్తూ, మరోవైపు నితీష్ కుమార్ ను విమర్శిస్తూ ఎన్నికలకు వెళ్లాడు చిరాగ్. ఎల్జేపీ ఏ గాలిలో ఆ గాలికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. యూపీఏ అధికార కాలంలోనూ రామ్ విలా్ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, ఎన్డీయే అధికారంలోకి వచ్చాకా అటు కూడా పదవులు పొందాడు. అయితే చిరాగ్ కు ఆ చాతుర్యం వచ్చినట్టుగా లేదు!
ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ పై ఎల్జేపీలోని ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారంతా తమను కొత్త పార్టీగా గుర్తించాలంటూ లోక్ సభ స్పీకర్ కు లెటర్ ఇచ్చారట! ఉన్న ఆరు మంది ఎంపీల్లో ఇలా ఐదు మంది కొత్త గ్రూప్ గా ఏర్పాటు గురించి స్పీకర్ కు లేఖ ఇవ్వడం గమనార్హం. చిరాగ్ నాయకత్వం పై వ్యతిరేకతతోనే వారు కొత్త పార్టీ ఏర్పాటుకు రెడీ అయ్యారట. త్వరలోనే కేంద్రమంత్రి మండలి పునర్వస్థీకరణ నేపథ్యంలోనే ఎల్జేపీలో ఈ రచ్చ రేగినట్టుగా తెలుస్తోంది.
మోడీ మంత్రి వర్గంలో చిరాగ్ పాశ్వాన్ కు స్థానం దక్కనుందనే ప్రచారం జరుగుతూ ఉంది. యూపీ ఎన్నికల నేపథ్యంలో మోడీ తన మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాదిన కుల సమీకరణాలకు అనుగుణంగా ఈ మార్పులు జరగనున్నాయట. ఈ నేపథ్యంలో చిరాగ్ కు స్థానం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో రామ్ విలాస్ ఇప్పుడు ఆయన తనయుడు కేంద్రంలో మంత్రి.. అనే ప్రచారంతో పట్ల ఎల్జేపీలో అసంతృప్తి రేగుతోందట.
ఈ తిరుగుబాటుకు చిరాగ్ కు దగ్గరి బంధువు, ఇతడి అంకుల్ పశుపతి పరాస్, ఆయన తనయుడు, ఎంపీ ప్రిన్స్ రాజ్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారట. తనకు కేంద్రమంత్రి పదవి కావాలని పశుపతి పరాస్ కోరుకుంటున్నారట. ఈ తిరుగుబాటుకు జేడీయూ కూడా మద్దతు ఇస్తోందని టాక్.
నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చిరాగ్ ప్రచారం చేయగా, పశుపతి పరాస్ మాత్రం నితీష్ పట్ల సానుకూలంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటుకు జేడీయూ మద్దతు ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు పార్టీలకూ పెద్దన్న బీజేపీ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో!