చంద్రబాబునాయుడు అంత నమ్మదగిన నాయకుడు కాదని ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా అంటుంటారు. అలాంటి చంద్రబాబే మోసపోయారంటే…. ఏమనుకోవాలి? అది కూడా సొంత పార్టీ వాళ్ల చేతిలోనే మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్‌బ్యాంక్ ఎన్నికల్లో గౌరవప్రదమైన పోటీ ఇచ్చి, మూడు నాలుగు డైరెక్టర్ల స్థానాలను గెలుస్తారని చంద్రబాబు ఆశించారు.
అయితే చంద్రబాబు నమ్మకాన్ని తిరుపతి టీడీపీ నేతలు వమ్ము చేశారు. అంతా బాగుందనిపించి, ఎన్నికల రోజు పూర్తిగా చేతులెత్తేశారు. “మీరు కొట్టినట్టు ఉండాల, మేము ఏడ్చినట్టు ఉండాలి” అనే రీతిలో టీడీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరలేపారు. తిరుపతి టౌన్ బ్యాంక్‌లో 57,250 మంది ఓటర్లున్నారు. భారీస్థాయిలో ఓటర్లున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాలు తెలియని జనసేన పోటీ చేయకుండా అభాసుపాలైంది.
కానీ టీడీపీ నేతలు ముదుర్లు కావడంతో బరిలో నిలిచారు. బరిలో నిలిచి సొమ్ము చేసుకున్నారు. గతంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులు చాలా చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి. అలాగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యర్థులకు ఏజెంట్లు కూడా లేని దుస్థితి. కానీ తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ ఢీ అంటే ఢీ అని అధికార పార్టీకి దీటుగా 12 డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు వేసింది.
ఏందబ్బా తిరుపతిలో టీడీపీ నేతలు యాక్టీవ్ ఎప్పుడయ్యారనే అనుమానం కలిగింది. ఎందుకంటే తిరుపతిలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ సమస్య వుంది. ఇదే వైసీపీ విషయానికి వస్తే భూమన నేతృత్వంలో బలమైన నాయకత్వం ఉంది. టీడీపీతో పోల్చితే వైసీపీకి స్థిరమైన కేడర్ లేదు. తాజాగా ఎన్నికల తీరు చూస్తే…. అధికార పార్టీతో ముందస్తు ఒప్పందంలో భాగంగానే అంతా ముందుగా అనుకున్నట్టే జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు, లోకేశ్‌లకు అనుమానం రాకుండా తిరుపతి నియోజకవర్గ టీడీపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారం వైసీపీతో ఒప్పందం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలను తిరుపతి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి టీడీపీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న నాయకురాలికి నగరం చుట్టుపక్కల ఆక్రమిత స్థలాలున్నాయి. అలాగే తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో అనుమతి లేకుండా భారీస్థాయిలో అక్రమ నిర్మాణాలున్నాయి.
అక్రమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు అధికార అండ అవసరమైందని, అందుకే వైఎస్సార్సీపీకి నాయకత్వ బాధ్యతల్లో వున్న వాళ్లే అమ్ముడు పోయారని ద్వితీయ శ్రేణి టీడీపీ నేతలు వాపోతున్నారు. అలాగే తిరుపతి కార్పొరేషన్లో టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఉన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఈయన పాలునీళ్లలా కలిసిపోయి వుంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ ప్రజాప్రతినిధులను వైసీపీ ఆహ్వానిస్తున్న పరిస్థితి వుందా? కానీ తిరుపతిలో ఆ పరిస్థితి వుంది.
తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించినా, గంగజాతర నిర్వహించినా టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణకు ప్రాధాన్యం వుంటుంది. పచ్చ చొక్కా వేసుకుని అంతా తానే అన్నట్టు వ్యవహరించే ఆర్సీ మునికృష్ణ పార్టీ ఎప్పుడు మారారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్న సందర్భాలు అనేకం.
ఇదే మరి రహస్యం. నియోజకవర్గ నాయకులు, కార్పొరేటరే వైఎస్సార్సీపీ ప్రలోభాలకు గురైతే… ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏం చేయగలుగుతుంది? తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో నామినేషన్లు మొదలు, ఆ తర్వాత విస్తృత ప్రచారం, వైఎస్సార్సీపీ అంతు చూస్తామని టీడీపీ నేతల హెచ్చరికలు, నిన్నటి ఎన్నికల రోజు వరకూ అంతా బాగానే వుందనే భ్రమల్ని అధిష్టానానికి, కిందిస్థాయి కేడర్‌కు కలిగించడంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు సక్సెస్ అయ్యారు.
గత మూడేళ్లలో తిరుపతిలో ప్రత్యర్థులపై చిన్న కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈ ఎన్నికలొచ్చే సరికి కేసులు, అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం నిజమే అనుకున్నట్టు అంతకంటే అజ్ఞానం మరొకటి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుప్పంలోనే తమ పార్టీ చేతులెత్తేసిందని, ఇక తిరుపతిలో తామెంత అని టీడీపీ నాయకులు అంటున్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటింగ్ 18 లేదా 20 శాతానికి మించిన దాఖలాలు లేవు. కానీ నిన్నటి ఎన్నికల్లో మాత్రం 72 శాతం నమోదైంది. దీన్ని బట్టి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ప్రజాస్వామ్య హననం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
తిరుపతి ఎమ్మెల్యే రౌడీయిజానికి చంద్రబాబు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి సహకారం తోడైంది. ఇక పరోక్షంగా టీడీపీ మద్దతు లేకపోతే ఇంత విచ్చలవిడిగా వైఎస్సార్సీపీ రిగ్గింగ్‌కు పాల్పడేదా? వైఎస్సార్సీపీ, టీడీపీ ఆడిన టౌన్ బ్యాంక్ ఎన్నికల డ్రామాలో ఓటర్లు పావులయ్యారు. పౌర సమాజం, ప్రజాసామ్యం పూల్స్ అయ్యాయి. అన్నిటికీ మించిన సొంత జిల్లాలో, అది కూడా తిరుపతి టీడీపీ నాయకులు తనను వంచించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారు.