జగన్ని ఏమీ తెలియదు, ఆయనకు ఏం అనుభవం ఉందని అంతా అన్నారు. పచ్చ పార్టీ వాళ్ళైతే జగన్ మంత్రిగా అయినా చేశాడా, పాలన అంటే ఏంటనుకున్నారోనని ఎకసెక్కాలు ఆడారు.
సరే ఎవరు ఏమనుకున్నా ముఖ్యమంత్రిగా జగన్ మాత్రం తనదైన శైలిలో పాలనకు శ్రీకారం చుట్టారు. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే వాలంటీర్ల వ్యవస్థ జగన్ ముందు చూపునకు నిదర్శనం అని అంతా అంటున్నారంటేనే జగన్ సత్తా ఏంటో అర్ధం చేసుకోవాలి మరి.
కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సమయంలో కూడా గ్రామ వాలంటీర్లు మొక్కవోని ధైర్యంతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు అందిస్తున్నారు. ముఖ్యంగా పించన్లు ఫస్ట్ తారీకుకే ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.
ఇక జగన్ సర్కార్ కరోనా వైరస్ నేపధ్యంలో పేదలకు అందించే వేయి రూపాయల సాయం కూడా వాలంటీర్లు ప్రతీ ఇంటికీ వెళ్ళి ఇస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం లోవముకుందాపురంలో ఒక వాలంటీర్ చేసిన పని జగన్ సర్కార్ కే గర్వకారణం అని చెప్పాలి.
తేడ సింహాచలం అనే గ్రామ వాలంటీర్ ఇక్కడ ఉన్న రైవాడ జలాశయం దాటుకుని మరి గిరిజన గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒకే ఒక లబ్దిదారురాలు వంతు పోతమ్మకు వేయి రూపాయల ఆర్ధిక సాయం అందించి శభాష్ అనిపించుకున్నాడు.
ఈ జలాశయం దాటేందుకు పడవ మీద మరీ ప్రయాణం చేసి వచ్చిన వాలంటీర్ సింహాచలాన్ని అక్కడ గ్రామస్తులు మొత్తం అభినందించారంటేనే జగన్ టీం ఎలాంటిదో అర్ధం కావడంలేదూ. ఏది ఏమైనా జగన్ సైన్యం ఇలా చిత్తశుద్ధితో పట్టుదలతో ఉండబట్టే ఏపీలో సంక్షేమం క్షేమంగా ప్రతీ ఇంటికీ చేరుతోంది మరి.