కరోనా దెబ్బకు హీరోల ప్లానింగ్ తుస్సు

ఏమో.. ఈ ఏడాది వీలైతే 4 సినిమాలు కూడా రిలీజ్ చేస్తానేమో.. రీసెంట్ ఇంటర్వ్యూలో నితిన్ స్టేట్ మెంట్ ఇది. అబ్బ.. ఎంత చక్కటి ప్లానింగ్ అనుకున్నారంతా. కట్ చేస్తే కరోనా వచ్చింది. నితిన్…

ఏమో.. ఈ ఏడాది వీలైతే 4 సినిమాలు కూడా రిలీజ్ చేస్తానేమో.. రీసెంట్ ఇంటర్వ్యూలో నితిన్ స్టేట్ మెంట్ ఇది. అబ్బ.. ఎంత చక్కటి ప్లానింగ్ అనుకున్నారంతా. కట్ చేస్తే కరోనా వచ్చింది. నితిన్ ప్లానింగ్ బెడిసికొట్టింది. 4 సంగతి దేవుడెరుగు.. 3 సినిమాలు రావడమే గగనం అన్నట్టు తయారైంది పరిస్థితి.

నితిన్ నుంచి ఆల్రెడీ భీష్మ రిలీజైంది. రంగ్ దేను వీలైనంత త్వరగా రిలీజ్ చేద్దామనుకున్నాడు. కానీ షూటింగ్ స్టేజ్ లోనే అది ఆగిపోయింది. ఇది కంప్లీట్ అయితే తప్ప భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు షిఫ్ట్ అవ్వలేడు. కాబట్టి నితిన్ నుంచి ఈ ఏడాది 3 సినిమాలొస్తే అది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. పైగా మధ్యలో పెళ్లి కూడా పెట్టుకున్నాడు. కరోనా వల్ల వాయిదాపడిన ఆ పెళ్లి, ఈ ఏడాదిలోనే ఉండబోతోంది మరి.

కరోనా దెబ్బకు బుక్కయింది కేవలం నితిన్ ఒక్కడే కాదు.. నాని, నిఖిల్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత అవుతుంది. కాకపోతే నితిన్ తర్వాత అలా 3 సినిమాల్ని ఒకే ఏడాదిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన హీరో నాని మాత్రమే. నానికి ఇది అలవాటు కూడా. ఈ ఏడాది V సినిమాతో బోణీ కొట్టి, ఆ వెంటనే మినిమం గ్యాప్ లో టక్ జగదీష్ ను రంగంలోకి దించి, ఏడాది చివరి నాటికి క్రిస్మస్ కానుకగా శ్యామ్ సింగరాయ్ ను కూడా థియేటర్లలోకి వదలాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్లానింగ్ మొత్తం మార్చుకోవాలి. ఈ ఏడాది టక్ జగదీష్ వరకు గ్యారెంటీ అని చెప్పుకోవాలి.

నిఖిల్ కూడా చకచకా సినిమాలు ఎనౌన్స్ చేశాడు. అర్జున్ సురవరం తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఈ హీరో అటు కార్తికేయ-2ను లాంఛ్ చేస్తూనే, ఇటు 18 పేజెస్ అనే మరో సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలతో పాటు కుదిరితే ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ను కూడా ఈ ఏడాదిలోనే తీసుకొస్తానని ఆమధ్య ప్రకటించాడు. అడ్వాన్స్ కూడా తన వద్దే ఉందని చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఏడాది నిఖిల్ నుంచి ఒక్క సినిమా వస్తే అదే చాలా ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్థితి.

కరోనా వల్ల చిరంజీవి లెక్క కూడా తప్పింది. ఆచార్య సినిమాను వంద రోజుల్లో పూర్తిచేయాలనుకున్న మెగాస్టార్ కు అనుకోని అడ్డంకిగా కరోనా వచ్చిపడింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఇండస్ట్రీలో అందరికంటే ముందే షూటింగ్ ఆపేశారు చిరు. అనుకున్న ప్రకారం ఈ సినిమా షెడ్యూల్స్ నడిస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించాలని యూనిట్ భావించింది. కానీ కరోనా కారణంగా చిరు ప్లాన్స్ అన్నీ అటకెక్కాయి.

చిరు తనయుడు చరణ్ పరిస్థితి మరీ ఘోరం. అటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోయింది. ఇటు తను నిర్మాతగా తీస్తున్న ఆచార్య ఆగిపోయింది. ఈ రెండూ ఆగిపోయినందుకు చరణ్ కు బాధ లేదు. మరో కొత్త సినిమా ఎనౌన్స్ చేయాలనుకున్న ఆయన ప్లానింగ్ కు కరోనా అడ్డుకట్ట వేసింది. ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉంటుండగానే త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. చరణ్ కూడా అలానే ఎనౌన్స్ చేయాలనుకున్నాడు కానీ ఆచార్య-ఆర్ఆర్ఆర్ మరింత లేట్ అవ్వడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.

ప్రభాస్, అల్లు అర్జున్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ప్రభాస్ అయితే తన కొత్త సినిమా యూరోప్ షెడ్యూల్ ను మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చేశాడు. యూరోప్ లోనే మరో షెడ్యూల్ ఉంది. ఈ కరోనా దెబ్బకు అసలు యూరోప్ లో అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. మరి ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి. అటు బన్నీ కూడా సుకుమార్ తో చేయాల్సిన సినిమాను ఈపాటికి స్టార్ట్ చేయాలి. కానీ కరోనా కారణంగా సినిమా షూట్ స్టార్ట్ కాలేదు. అలా అల వైకుంఠపురములో షూటింగ్ కంప్లీట్ అయినప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు బన్నీ. వీళ్లతో పాటు సీనియర్లైన బాలకృష్ణ-బోయపాటి సినిమా, వెంకటేశ్-నారప్ప మూవీ. నాగార్జున-వైల్డ్ డాగ్ సినిమాల షూటింగ్స్ కూడా నిరవథికంగా వాయిదాపడ్డాయి.

ఇలా ఒకరిద్దరు కాదు… టాలీవుడ్ కు చెందిన దాదాపు హీరోలంతా ప్లానింగ్స్ తప్పారు. నెక్ట్స్ ఏంటనేది కూడా ఆలోచించుకోలేని విధంగా తయారైంది వీళ్ల పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో కాస్త హ్యాపీగా ఉన్నది మహేష్ బాబు ఒక్కడే. ఏ సినిమా చేద్దామా అని నిర్ణయించుకునేలోపే కరోనా వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కూడా గట్టిగా అడగలేని పరిస్థితి. పరశురాం సినిమాకు ఓకే చెప్పాడు కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా నీకెంత-నాకెంత అని వాటాలు వేసుకునే దగ్గరే ఉంది. కరోనా కాలం ముగిసిన తర్వాత తీరిగ్గా సినిమా ప్రకటించి సెట్స్ పైకి వెళ్తాడు మహేష్.

రోనా తగ్గేవరకన్నా కొంచెం తగ్గండి బాబు గారూ