1996లో పుట్టిన ఒక అమ్మాయి సంపాదన మీద ఇటీవలే ఐటీ రైడ్స్ జరిగాయంటే అది ఆమె సక్సెస్ కు నిదర్శనం అని నిర్వచించవచ్చు. ఆ రేంజ్ సక్సెస్ తో దూసుకుపోతోంది రష్మిక మందన్న. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈమె కెరీర్ సాగిపోతూ ఉంది. ఒకే ఒక రాంగ్ స్టెప్, ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం. అదొకటే చిన్నపాటి మరక. అయినా పెళ్లి అనేది అంత చిన్న వయసులో చేసుకునేది కూడా ఈ తరంలో. కాబట్టి… ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు.
ఈ రోజు ఈ హీరోయిన్ బర్త్ డే. ఇటీవలే తెలుగులో మరో మంచి హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మధ్యన 24వ పుట్టిన రోజును జరుపుకుంటోంది రష్మిక. ప్రస్తుతం ఈ హీరోయిన్ కు చేతి నిండా అవకాశాలున్నాయి. త్వరలోనే తమిళంలోకి అధికారిక ఎంట్రీ ఇవ్వనుంది. కార్తీ సరసన నటిస్తూ డైరెక్ట్ తమిళ సినిమాలో కనిపించబోతోంది.
ఇక 'భీష్మ' హిట్ తో ఈ హీరోయిన్ గ్రాఫ్ మరింత పెరిగినట్టే. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తన నటన ద్వారా కొంతమందిని విసిగించింది రష్మిక. అదంతా ఆ సినిమా డైరెక్టరు మార్కు నటన. అయితే భీష్మలో మరో మెచ్యూర్డ్ రోల్ లో ఒదిగిపోయింది.
ఇక అల్లు అర్జున్-సుకుమార్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించబోతోందని, చిత్తూరు అమ్మాయి శేషమణి పాత్రలో ఈ హీరోయిన్ కనిపించబోతోందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో కూడా రష్మిక ఉందని, రామ్ చరణ్ రోల్ కు జోడీగా నటించబోతోందని తెలుస్తోంది. ఇలా కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న తరుణంలో పుట్టిన రోజును మరింత హ్యాపీగా జరుపుకుంటోంది రష్మిక.