కొణిదెల కుటుంబమే కాదు….టాలీవుడ్ పెద్దన్నయ్యగా పిలుచుకునే పెద్ద మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడుతూ, ప్రతిగా అంతే గౌరవాన్ని దక్కించుకుంటూ…తన మాటకంటూ ఓ విలువను ఏర్పరచుకున్న వ్యక్తిత్వం చిరంజీవిది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తోటి సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని కొంత మంది చిత్ర పరిశ్రమ మిత్రులతో కలిసి ఏర్పాటు చేసి, సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనాతో పాటు ఇతరత్రా విషయాలపై ఆయన మనసులో మాట బయటపెట్టారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
‘ఆచార్య’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి గురించి తాను విన్నానని చిరంజీవి చెప్పాడు. కరోనాపై దర్శకుడు కొరటాల శివ, సోనూసూద్‌తో చర్చించానన్నాడు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకారో, సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం విన్నాం. దీంతో వెంటనే దర్శకుడు శివకు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ నిలిపేద్దామని చెప్పినట్టు చిరు వెల్లడించాడు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మనం కారణం కాకూడదు’ అనే తన భావాన్ని దర్శకుడు అర్థం చేసుకుని షూటింగ్ నిలిపేసినట్టు చిరంజీవి తెలిపాడు. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌లను కూడా ఒక్కొక్కరుగా ఆపి వేసినట్టు చిరంజీవి తెలిపాడు.
కరోనా నుంచి కాపాడుకునేందుకు అవగాహన కల్పించడంతో పాటు కుటుంబంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు చిరంజీవి తెలిపాడు. నిబంధనల అమల్లో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఆయన చెప్పాడు. లాక్డౌన్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్ని రకాల సిబ్బందికి సెలవులు ఇచ్చినట్టు ఆయన వెల్లడించాడు. వంట మనుషులతో పాటు ఇంట్లో ఉండే సహాయకులు మాత్రం తమతో పాటు మొదటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారని చెప్పాడు. వాళ్లంతా తమతో పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నారన్నాడు.
అలాగే కొంత కాలం పాటు అతిథులెవరూ తమ ఇంటికి రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నట్టు చిరంజీవి తెలిపాడు. తమ అమ్మాయిలు, చెల్లాయిలు తమతమ కుటుంబాలతో తన ఇంట్లోనే ఉంటున్నారని చిరంజీవి తెలిపాడు. అందరూ కలిసి కొత్త సినిమాలు చూస్తున్నామని, మంచి పుస్తకాలు చదువుతున్నట్టు చిరంజీవి చెప్పాడు. అన్నిటికి మించి నిశ్శబ్ద వాతావరణంలో పక్షుల కిలకిలా రావాలు వింటూ ప్రకృతిలో మమేకం కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నాడు. కరోనా నిర్బంధ సమయంలో ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. తన ఆత్మకథ రాసుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నట్టు చెప్పాడు. ఈ ఖాళీ సమయంలో దాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. గతం తాలూకూ జ్ఞాపకాల్ని సురేఖతో కలిసి గుర్తు చేసుకుంటూ, వాటిని వీడియో రూపంలో రికార్డు చేసుకుంటున్నట్టు చిరంజీవి వెల్లడించాడు.
కరోనా విపత్తు సమయంలో తనకు మొదట సినీ కార్మికులు గుర్తుకు వచ్చారన్నాడు. రోజువారీ వేతనం లభిస్తే తప్ప పొట్టగడవని పరిస్థితి వాళ్లలో చాలామందిదని, షూటింగ్స్ లేకపోతే వారి జీవనాధారం ఆగిపోతుందని ఆందోళన చెందినట్టు చిరంజీవి తెలిపాడు. వాళ్లు ఆకలితో పస్తులు ఉండకూడదు, వెంటనే ఆదుకోవాలని అనిపించిందన్నాడు. మరో ఆలోచన లేకుండా సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించానన్నాడు. ఆ స్ఫూర్తితో సోదర హీరోలందరూ ముందుకు వచ్చి చేయూతనిచ్చారన్నాడు.
ప్రస్తుతం నెలరోజులకు సరిపడా రూ.2222 విలువగల నిత్యావసర వస్తువులతోపాటు, శానిటైజర్, కొన్ని మాస్క్‌లు అందజేస్తున్నట్టు చిరంజీవి వెల్లడించాడు. లాక్డౌన్ కొనసాగి మళ్లీ షూటింగ్‌లు లేకపోతే మరో నెలకు కూడా సాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చిరంజీవి వివరించాడు.
‘ఆచార్య’ సినిమా, దర్శకుడు కొరటాల శివ గురించి చిరంజీవి గొప్పగా చెప్పాడు. ఇంత వరకూ ఎవరూ చెప్పని విషయాలను తెలుగు సమాజానికి చిరు తెలియజేశాడు. కొరటాల గురించి చిరంజీవి చెప్పిన సంగతులివే…
‘కొరటాల శివ సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వ్యక్తి. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువ. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడు. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని… బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి’ అని చిరంజీవి చెప్పుకుపోయాడు.