ఈ నెల 14వ తేదీ తర్వాత లాక్‌డౌన్ దశల వారీగా ఎత్తివేస్తారని ఆశిస్తున్న వాళ్లకు నిరాశ మిగిల్చే సమాచారం. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో…ఇప్పుడిప్పుడే కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ తొలగించేందుకు సాహసించదనే ప్రచారం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. అయితే ఆ ప్రచారం అంతా అబద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఆ ప్రకటన తర్వాత దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని సమాచారం. లాక్‌డౌన్‌ను మరి కొంత కాలం పొడిగిస్తారని అనధికార సమాచారం. దీనికి బలం చేకూరుస్తూ వెలువడిన ఓ కథనం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్‌డౌన్, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది.
బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం….
‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్ వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్ వైద్యులకు అంత సులువు కాదు. వైరస్ వ్యాప్తి తగ్గకముందే లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 14 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కూడా కొనసాగిస్తారా? లేదా అనే అంశంపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీజీ నివేదిక భారతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేసేలా ఉంది. అయితే ఆ నివేదికలో పేర్కొన్నట్టు దేశంలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. దీన్ని ఎవరూ కాదనలేరు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరుకోగా, ఇప్పటివరకు 72 మంది మృతి చెందారు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తొలగిస్తారని ఎవరైనా అంటే నమ్మశక్యంగా లేదని వైద్యనిపుణులు అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.