దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 601 కొత్త కరోనా కేసులు రిజిస్టర్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,072కు పెరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 75 మంది మరణించినట్టుగా సమాచారం. రికవర్ అయిన వారి సంఖ్య దాదాపు రెండు వందలకు పైనే అని తెలుస్తోంది. ఇలా వరసగా మరో రోజు కరోనా కేసుల సంఖ్య పెరిగింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో శనివారం రోజున 43 కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా సమాచారం. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 272కు చేరింది. వీరిలో 11 మంది మరణించినట్టుగా, 33 మంది కరోనా నుంచి కోలుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీ విషయానికి వస్తే.. శనివారం రోజున మరో 12 కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా సమాచారం. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 192కు పెరిగినట్టుగా తెలుస్తోంది.
స్థూలంగా కొత్తగా రిజిస్టర్ అయిన కేసుల్లో కూడా మెజారిటీ మొత్తం ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఒకే రీతిలో దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది గత నాలుగు రోజులుగా. ఇప్పుడు బయటపడుతున్న కేసులన్నీ కూడా ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం ఉన్న కేసులే. దేశంలో కరోనా ఉదృతి ఏ స్థాయిలో ఉంటుందనేందుకు ఇంకా పూర్తి స్పష్టత లేనట్టే. సోమవారం నుంచి కొత్త కేసులు ఏ స్థాయిలో రిజిస్టర్ అవుతాయనేదాన్ని బట్టి మరింత స్పష్టత రావొచ్చు.