ఒకవైపు థియేటర్లు మూతబడ్డాయి. కొత్త సినిమాల విడుదలలు లేవు. సినిమాలు మానవ జీవితంలో ఎంతగా పెనవేసుకున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. అవే ప్రధాన వినోదం. థియేటర్ వెళ్లి సినిమా చూడటం అనేది ఎప్పటికప్పుడు, ప్రతి వారం నూతన ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. కరోనా వేళ అలాంటి ఉత్సాహానికి అవకాశమే లేదు. ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి! థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో, సినిమాలు ఎప్పటికి విడుదల అవుతాయో ఎవరికీ తెలియదు. అయితే అంత వరకూ వినోదానికి అయితే కొంత వరకూ లోటు లేదు. ఆ వినోదం టీవీలతో ముడిపడింది కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. టీవీ చానళ్లు జనాలను బోర్ కొట్టిస్తున్నాయి.
తెలుగులో ఇప్పుడు 24 గంటల పాటు సినిమాలు వేసే చానళ్లు అరడజను వరకూ ఉన్నాయి. ఒక సీరియళ్లు, రోజుకు ఒకటీ రెండు సినిమాలు వేసే చానళ్లు అదనం. అయితే ఇన్ని చానళ్లున్నా.. వాటిల్లో వేసిది మాత్రం కొన్ని సినిమాలే! వాటినే తిప్పి తిప్పి వేస్తూ ఉన్నారు. ఒక్కో నెట్ వర్క్ లో ఇప్పుడు కనీసం అరడజను చానళ్లున్నాయి. దీంతో సినిమాల పునఃప్రసారం మరింత ఎక్కువైపోతోంది.
గత వారం రోజుల్లోనే ఒక నెట్ వర్క్ లో 'జెర్సీ' సినిమాను రెండు మూడు సార్లు ప్రసారం చేశారు! వరసగా రోజుకు ఒకసారి చొప్పున ఆ సినిమాను ప్రసారం చేశారు! ఆ ఒక్క సినిమా అనే కాదు, ఆయా నెట్ వర్క్ ల వద్ద చానళ్లు చాలానే ఉన్నా, సినిమాలు మాత్రం తక్కువే! ఒక రోజు ఒక చానల్ లో వచ్చిన సినిమా మరుసటి రోజే ఆ నెట్ వర్క్ లోని మరో చానల్ లో ప్రసారం అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఒక్కో నెట్ వర్క్ వద్ద ఏ డజను సినిమాలో ఉంటాయి.. వాటిని వారానికి ఏదో ఒక చానలో రెండు మూడు సార్లు వేసి జనాలను విసిగిస్తూ ఉంటారు.
ఇన్నాళ్లూ ఒక లెక్క! అప్పుడు జనాలు ఉదయం లేస్తే తమ పనుల మీద తాము వెళ్లిపోయే వారు. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడే టీవీ. అందునా ఏవో సెలెక్టెడ్ గా తమకు నచ్చిన ప్రోగ్రామ్స్ ను చూసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా కాదు, 24 గంటలూ ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. నగరాల్లోని వారు కూడా సొంతూళ్లకు చేరుకుని కొందరు, నగరాల్లోనే ఇళ్లకు పరిమితం అయిన వారు మరి కొందరు. ఇలాంటి నేపథ్యంలో టీవీ వీక్షణ చాలా పెరిగింది. ఇంతకు ముందు రోజులో ఏ గంటో అరగంటో టీవీ చూసే వాళ్ళు, ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక పగలంతా టీవీ ముందు కూర్చునే పరిస్థితి ఉంది. ఇప్పుడు టీవీ చానళ్ల అసలు రంగు బయటపడుతూ ఉంది. ప్రతి రోజూ వేసిన సినిమాలనే వేస్తూ జనాలను అవి విసిగిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. టీవీ చానళ్ల తీరుపై జనాలు విసిగెత్తిపోతున్నారు. వారం పది రోజులకే.. టీవీలు విసిగెత్తిస్తూ ఉన్నాయి. బయట థియేటర్లు లేక, టీవీల్లో ప్రతి రోజూ అవే సినిమాలను రిపీట్ చేస్తూ ఉండటంతో విసిగెత్తిన ప్రజలు.. వెబ్ స్ట్రీమింగ్ వైపు వేగంగా వెళ్లిపోయారు.
ఇది వరకూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిల్లో అకౌంట్లు లేని వారు కూడా, ఇప్పుడు అటు వైపు అడుగులు వేస్తున్నారు, వేశారు. తెలుగు జనాల్లో చాలా మంది అమెజాన్ అకౌంట్ ను మొదటి నుంచి కలిగి ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ అకౌంట్ తో ఆ ఇ-కామర్స్ సైట్ నుంచి సరుకుల డెలివరీ ఫ్రీ కావడం, వేగంగా డెలివరీ అయ్యే అవకాశం ఉండంతో.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను వారు కొనసాగిస్తూ వచ్చారు. ఇన్నాళ్లూ అకౌంట్ ను కలిగి ఉండటమే తప్ప అందులో పెద్దగా సినిమాలు చూడని చాలా మంది.. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా వాటిల్లో సినిమాలను వీక్షిస్తూ ఉన్నారు. క్వారెంటైన్ టైమ్ లో అమెజాన్ స్ట్రీమింగ్ బాగా పెరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా అమెజాన్ తన వీక్షకులకు మంచి మంచి సినిమాలను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ఆస్కార్ ఆవార్డులను కొల్లగొట్టిన సౌత్ కొరియన్ సినిమా 'పారసైట్' ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఆ కొరియన్ భాష సినిమా అమెరికాలో అవార్డులను కొల్లగొట్టడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆస్కార్ అవార్డులను పొందిన ఆ సినిమాను చూడటానికి అప్పట్లో చాలా మంది భారతీయులు తపించారు. అయితే అది కొరియన్ సినిమా కావడంతో.. ఇండియన్ స్ట్రీమింగ్ లో అంత తేలికగా అది దొరకలేదు. ఎవరో కొందరు మాత్రం విదేశాల నుంచి ఏదోలా ప్రింట్ తెప్పించుకుని చూడగలిగారు. ఇప్పుడు అమెజాన్ లో ఆ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చింది.
అలాగే అమెజాన్ లో తరిచి చూస్తే చాలా క్లాసిక్స్ ఉన్నాయనే విషయం కూడా ఇప్పుడిప్పుడు అందరికీ ఎరుకలోకి వస్తోంది. తెలుగు సినిమాలు అయినా, భారతీయ భాషల్లోని ఇతర సినిమాలు అయినా, అంతర్జాతీయ సినిమాలు అయినా.. ఎన్నో అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఎప్పుడు విడుదల అయ్యాయో, అసలు అవి థియేటర్లో విడుదల అయ్యాయో లేదో ఎవరికీ తెలియని చాలా సినిమాలు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఇక వరల్డ్ సినిమాకు సంబంధించి కావాలని కొన్ని క్లాసిక్ సినిమాల పేర్లను సెర్చ్ చేస్తే కొంత నిరాశ తప్పదు. కొన్ని కొన్ని అపురూప సినిమాలు అమెజాన్లో అందుబాటులో లేవు. అయితే పూర్తిగా నిరాశఏమీ మిగలదు. కొంత వరకూ అమెజాన్ అంతర్జాతీయ సినిమాలను అందుబాటులో ఉంచింది.
ఇక నెట్ ఫ్లిక్స్ తన డిమాండ్ కు తగ్గట్టుగా ఇప్పుడు రూటు మార్చింది. ఇన్నాళ్లూ ఒక నెల పాటు ఫ్రీ స్ట్రీమింగ్ అప్షన్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో ఆ ఆప్షన్ ను తీసేసినట్టుగా ఉంది ఈ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. తీసుకుంటే ఏడాది మెంబర్ షిప్ తీసుకోవాలి, లేదంటే లేదు. అమెజాన్ మాత్రం ఒక నెల ఉచిత సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది. ఆ తర్వాత కొనసాగించాలంటే కొనసాగింవచ్చు లేదంటే లేదు. నెట్ ఫ్లిక్స్ మాత్రం పూర్తి పెయిడ్ వెర్షన్ ను మాత్రమే ఇండియన్స్ కు అందుబాటులో ఉంచింది. ఏదో తాత్కాలికంగా దాన్ని వాడుకునే సదుపాయం లేదు.
ఇక ఇవి మాత్రమే గాక దేశీయ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ బోలెడన్ని అందుబాటులోకి వచ్చాయి. జీ నెట్ వర్క్, సన్ నెట్ వర్క్ వాళ్ల పెయిడ్ యాప్స్ ఉండనే ఉన్నాయి. వీటికి ఒక మేజర్ డిజ్ అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే ఎలాగూ ఈ యాప్స్ లోని సినిమాలు ఆయా నెట్ వర్క్స్ లో రెగ్యులర్ గా ప్రసారం అవుతూనే ఉంటాయి. కొన్ని కొత్త సినిమాలను ఈ వెబ్ స్ట్రీమ్ లో ఆ నెట్ వర్క్ లు దాచి ఉంచుతున్నాయి. దాచి ఉంచినంత వరకే వాటిపై జనాల్లో క్రేజ్. ఒక్కసారి టీవీల్లో ఆ సినిమాలు టెలికాస్ట్ అయ్యాయంటే.. ఆ సినిమాలను మళ్లీ వెబ్ స్ట్రీమింగ్ లోకి వచ్చి చూసే ఆసక్తి ప్రేక్షకుల్లో సహజంగానే ఉండదు. అందుకే ఈ దేశీయ వెబ్ స్ట్రీమింగ్ యాప్స్ ఇప్పుడు కూడా అంత ఊపు మీదకు రాలేకపోతున్నాయి.
అక్కడకూ జీ నెట్ వర్క్ వాళ్లు కొన్ని ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తమ వెబ్ స్ట్రీమింగ్ కోసమే కొన్ని వెబ్ సీరిస్ లను రూపొందించడం, అమృతం సీరియల్ ను మళ్లీ తెర మీదకు తీసుకురావడం.. ఇవన్నీ ఆ ప్రయత్నాలే. ఈ ప్రయత్నాలకు ఫలితాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలియాల్సి ఉంది. ఏతావాతా క్వారెంటెయిన్ టైమ్ సినీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం లేదు. చూడాల్సిన, కావాల్సినన్ని సినిమాలు చూసుకుంటూ వారు వినోదాన్ని పొందడానికి ఇది తగిన సమయంగా మారింది. రోజుల తరబడి ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో, బయటకు అడుగు పెట్టడం కష్టం అయిన పరిణామాల్లో.. వెబ్ స్ట్రీమింగ్ యాప్స్ సినీ ప్రియులకు ఫుల్ టైమ్ పాస్ ను అందిస్తున్నాయి.