తబ్లిగీ జమాత్.. పిక్చర్ అభీ బాకీహై

ఢిల్లీలో తబ్లిగీ జమాత్ కి హాజరైనవారందర్నీ అక్కడ్నుంచి ఖాళీ చేయించి, వైద్యపరీక్షలు చేసి, కొంతమందిని క్వారంటైన్ లో కట్టడి చేసినంత మాత్రాన ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోలేదు. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. తబ్లిగీ…

ఢిల్లీలో తబ్లిగీ జమాత్ కి హాజరైనవారందర్నీ అక్కడ్నుంచి ఖాళీ చేయించి, వైద్యపరీక్షలు చేసి, కొంతమందిని క్వారంటైన్ లో కట్టడి చేసినంత మాత్రాన ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోలేదు. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. తబ్లిగీ జమాత్ కి వచ్చి వెళ్లిన వారిలో దాదాపు 900మంది విదేశీయులు ఢిల్లీలోని ఇతర మసీదుల్లో ఆశ్రయం పొందుతున్నారనే వార్త ఇప్పుడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీరందరినీ జల్లెడ పట్టడానికి ఖాకీలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఈరోజుకి  కూడా 900 మంది లెక్క తేలలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రోజులు గడిచేకొద్దీ.. వీరి ద్వారా వైరస్ ఎంతమందికి వ్యాప్తి చెందుతుందనే విషయంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలనుంచి ఢిల్లీకి వెళ్లినవారిలో కూడా కొంతమంది జాడ కనిపించడంలేదు. తెలంగాణ నుంచి నిజాముద్దీన్ సభకు వెళ్లినవారు 1030 మంది. జిల్లాలకు వచ్చిన 427 మందినీ గుర్తించారు, వారిలో కొందరిని క్వారంటైన్ కి తరలించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 603 మందిలో కొంతమంది జాడ ఇంకా పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. వారు ఎక్కడ మిస్సయ్యారన్న విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంనుంచి 1085 మంది ఢిల్లీ వెళ్లారు. వీరిలో 946 మంది తిరిగొచ్చారు, వీరందరి ఆరోగ్య పరిస్థితి ఆరా తీసిన అధికారులు, కరోనా లక్షణాలున్నవారికి ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స అందిస్తూ, అనుమానం ఉన్నవారిని క్వారంటైన్ కి తరలించారు. 139 మంది ఆచూకీ మాత్రం పోలీసులకు చిక్కలేదు.

ఢిల్లీ, హైదరాబాద్, ఏపీ మూడూ కలిపితేనే.. వెయ్యిమందికి పైగా తబ్లిగీ కార్యకర్తలు మిస్సింగ్. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వారంతా ఎక్కడున్నారు, ఆశ్రయమిచ్చినవారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎంత మందికి కరోనా వచ్చి ఉంటుంది, వారు ఇంకెంతమందికి అంటించి ఉంటారు. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలివి.

ఇప్పటికైనా నిజాముద్దీన్ సభకు హాజరైనవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకుంటే భారత్ లో కరోనా కట్టడికి ఓ అవకాశం చిక్కినట్టవుతుంది. లేకపోతే ఆ ఉపద్రవాన్ని ఊహించుకోవడమే కష్టం, పుట్ట పగిలినట్టు పుట్టుకొచ్చే కరోనా రోగులతో భారత్ కూడా శవాలదిబ్బ కాక మానదు.

ఇంట్లోనే ఉందాం కరోనాని కట్టడి చేద్దాం

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?