హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా ఉన్నారు. ఇందుకు ఈటల రాజీనామా ఆమోదమే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజీనామా పత్రాన్ని సమర్పించడమే ఆలస్యం… వెంటనే స్పీకర్ ఆమోదింపజేయడం గమనార్హం.
ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, ఈ రోజు తన ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్‌పార్క్ చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఈటల ఉద్వేగభరితంగా మాట్లాడారు.
హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని అభివర్ణించారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోందని స్పష్టం చేశారు. తనకు నిర్బంధం కొత్తకాదన్నారు.
నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే తన ఎజెండా అని తేల్చి చెప్పారు. సాధారణంగా రాజీనామా చేసిన ప్రజాప్రతినిధితో స్పీకర్ మాట్లాడి, మరోసారి పునరాలోచించుకోవాలని కోరడం చూశాం. కానీ ఈటల విషయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అలాంటి ఆలోచన చేయలేదు. వెంటనే ఆమోదించినట్టు ప్రకటించారు.
అంతేకాదు, హుజూరాబాద్ సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చారు. జెట్ స్పీడ్‌తో ఈటలపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించడాన్ని బట్టి …హుజూరాబాద్ ఉప ఎన్నికలో తాడోపేడో తేల్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు స్పష్టమవుతోంది.
హూజూరాబాద్ పోరు మరో దుబ్బాకను తలపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఈ ఉప ఎన్నిక మాత్రం రణస్థలాన్ని తలపిస్తుందని చెప్పక తప్పదు.