బొబ్బిలి యుద్ధం చరిత్రలో పదిలంగా ఎపుడూ ఉంటుంది. ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్య వేదికల మీద ఎన్నో సార్లు బొబ్బిలిలో జరిగిన రాజకీయ పోరు మహా యుద్ధాన్నే తలపిస్తూ సాగేది. ఇదిలా ఉంటే బొబ్బిలి రాజ వంశం వారసులు గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.
ఇపుడు హఠాత్తుగా మరో మారు అందరి దృష్టి బొబ్బిలి కోట మీద పడింది. దీనికి కారణం బొబ్బిలిలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామివారు. బొబ్బిలి రాజవంశీకులకు ఆయన ఆరాధ్యదైవం. బొబ్బిలి రాజులే అక్కడ అనువంశిక ధర్మకర్తలు.
ఇక వేణుగోపాలస్వామి వారు సంపన్న దైవం. ఆ దేవాలయాన్ని ఆనుకుని వేలాదిగా భూములు ఉన్నాయి. అంతే కాదు, బంగారం, వెండీ కేజీల కొద్దీ ఉంటుందని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే స్వామి వారికి నగలు, ఇతరత్రా ఆస్తుల వివరాలను సేకరించే పనిలో దేవాదాయ శాఖ ఇపుడు బిజీగా ఉంది.
ఈ మేరకు దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు స్వామి వారి ఆస్తుల చిట్టాను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే రాజకీయంగా ఇది బొబ్బిలి రాజులను ఇబ్బంది పెట్టే చర్యగా టీడీపీ సహా విపక్షాలు భావిస్తున్నాయి.
కానీ బొబ్బిలి రాజులు మాత్రం ఆస్తుల వివరాలు వెలికి తీసి మొత్తం స్వామి వారి నిధులు నిక్షేపాలు అన్నీ భద్రపరిస్తే తప్పు లేదు అంటున్నారు. అయితే ఆ వ్యవహరాంలో కాస్తా దూకుడు చేసి అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న తమ హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని బొబ్బిలి రాజులలో ఒకరైన బేబీ నాయన హెచ్చరిస్తున్నారు.
మరి దీని భావవేమి వేణుగోపాలా అనే ఇపుడు అడగాలేమో. ఎందుకంటే బొబ్బిలి యుద్ధానికి ఆనక జరిగిన అనేక సమరాలకు ఆయనే ప్రత్యక్ష సాక్షి కాబట్టి. చూడాలి మరి కధ ఎలా సాగేనో.