సామాజిక న్యాయం…ఇదీ జ‌గ‌‘నిజం’

సామాజిక న్యాయం…. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌చ‌నానికి అర్థాలే వేరు. ఆయన అనుకున్న‌దే సామాజిక న్యాయం. చేసిందే సామాజిక శాస‌నం. తాజాగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా అగ్ర‌వ‌ర్ణాల వారిని వైఎస్సార్‌సీపీ ప్ర‌క‌టించింది. ఇదే అత్యున్న‌త…

సామాజిక న్యాయం…. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నిర్వ‌చ‌నానికి అర్థాలే వేరు. ఆయన అనుకున్న‌దే సామాజిక న్యాయం. చేసిందే సామాజిక శాస‌నం. తాజాగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా అగ్ర‌వ‌ర్ణాల వారిని వైఎస్సార్‌సీపీ ప్ర‌క‌టించింది. ఇదే అత్యున్న‌త ప‌ద‌వుల‌కు సంబంధించి బీజేపీ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చి… సామాజిక న్యాయ‌మంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌డం వైఎస్సార్‌సీపీకే చెల్లిందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.  

ఎన్‌డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఆదివాసీ మ‌హిళ‌ని, అలాగే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ బీసీ నాయ‌కుడంటూ వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే ముందు వైఎస్సార్‌సీపీ అణ‌గారిన వ‌ర్గాల ఎంపీలు వ్యూహాత్మ‌కంగా మాట్లాడారు. వాళ్లు ఏమ‌న్నారంటే…

‘రాష్ట్రంలోనైనా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లైనా సామాజిక న్యాయ‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విధానం. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ల క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో బీసీల‌కు ప‌ట్టం క‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కూడా సామాజిక న్యాయానికే పెద్ద‌పీట వేశారు. రాష్ట్ర‌ప‌తిగా ఆదివాసీ మ‌హిళ ద్రౌప‌ది ముర్ము అభ్య‌ర్థిత్వానికి, అలాగే బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌గదీప్ ధ‌న్‌ఖ‌డ్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాం’ అని  వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు.  

రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థులిరువురూ బీజేపీ నేప‌థ్యం ఉన్న నేత‌లు. దేశంలో రాజ‌కీయంగా మ‌రింత‌ బ‌ల‌ప‌డేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేసింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. బీజేపీ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మే సామాజిక న్యాయం చేసిన‌ట్టుగా సంబ‌రాలు చేసుకుంటున్న వైఎస్సార్‌సీపీ…మ‌రి త‌న వ‌రకూ వ‌చ్చే స‌రికి ఏమైంది? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఎప్పుడో 8 నెల‌ల‌కు జ‌రిగే ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్‌, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా ఎస్‌.సుధాకర్‌, వెన్నపూస రవీంద్రారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డిల‌ను ఎంపిక చేశారు. వీరిలో సుధాక‌ర్ బ్రాహ్మ‌ణుడు. మిగిలిన ఇద్ద‌రు సీఎం సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

పైగా వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డిని రాజ‌కీయ వార‌సుడిగా తీసుకురావ‌డాన్ని గమ‌నించొచ్చు. మ‌రోనేత శ్యాంప్ర‌సాద్‌రెడ్డి న‌కిలీ మ‌ద్యం కేసులో ఇరుక్కుని, విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. రాష్ట్రంలోనైనా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లైనా సామాజిక న్యాయ‌మే ఏపీ సీఎం జ‌గ‌న్ ధ్యేయ‌మ‌ని చెబితే స‌రిపోతుందా? ఆచ‌ర‌ణ‌లో వైఎస్సార్‌సీపీ ఎక్క‌డ పాటించింద‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి?