1997, నేను ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్. తిరుపతి దగ్గర దుర్గసముద్రంలో తారకరాముడు షూటింగ్. ఆ రోజుల్లో తిరుపతి పరిసరాల్లో రెగ్యులర్‌గా షూటింగ్‌లు జరిగేవి. ఆంధ్రాలో కొంత భాగం షూట్ చేస్తే 2 లక్షలు సబ్సిడీ వుండేది. ఇదీ కారణం. దీనికి తోడు దుర్గసముద్రం ఆకుపచ్చగా కోనసీమలా వుండేది. చాలా సినిమాలు తీశారు.
శ్రీకాంత్ హీరో, సౌందర్య హీరోయిన్. ప్రెస్ కవరేజీకి రమ్మని పిలుపు. రిపోర్టింగ్ నా డ్యూటీ కాకపోయినా సౌందర్యని చూడాలని వెళ్లాను. అప్పటికే ఆమె హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది. టాప్ హీరోయిన్ కాలేదు కానీ, మంచి నటిగా పేరు. చాలా సినిమాలు చూడడం వల్ల నేను ఆమె అభిమానిని.
నారాయణమూర్తి అనే మిత్రుడితో కలిసి, ఒక జీపులో నేను, మరికొందరు రిపోర్టర్లు దుర్గసముద్రం వెళ్లాం. లంచ్ బ్రేక్‌లో హీరో హీరోయిన్లతో కాసేపు మాట్లాడాలని మా కోరిక. అందమైన ఆ వూళ్లోకి వెళ్లే సరికి కెమెరా, యూనిట్ సభ్యుల మధ్య శ్రీకాంత్ వున్నాడు. షూటింగ్ స్పాట్‌కి అంత దగ్గరగా వెళ్లడం అదే మొదలు.
శ్రీకాంత్ చిరునవ్వుతో ఆహ్వానించి కబుర్లు చెప్పాడు. తారకరాముడులో క్యారెక్టర్ గురించి వివరించాడు. సౌందర్య అక్కడ లేదు. ఆ రోజుల్లో కార్వాన్లు లేవు కాబట్టి హీరోయిన్లకి ఆ వూళ్లోని సర్పంచులు లేదా పెద్దవాళ్ల ఇంట్లో బస. అక్కడే మేకప్ , డ్రెస్ చేంజ్.
భోజనాలకు వేళైంది. ప్రెస్ వాళ్లకి స్పెషల్ లేదా అని ప్రొడక్షన్ వాళ్లని శ్రీకాంత్ అడిగితే వేడివేడి మిరప కాయ్ బజ్జీలు వడ్డించారు. లంచ్ ముగించి సౌందర్యని కలవాలని అడిగితే ఒక ఇంటికి తీసుకెళ్లారు.
అక్కడ ఒక ప్లాస్టిక్ కుర్చీలో సౌందర్య. సినిమాలో చూసినట్టుగానే వుంది. అందగత్తె. కళ్లలో చాలా దయ, వినయం. హీరోయిన్ అనే గర్వం లేకుండా తనని చూడడానికి వచ్చిన ఆ వూరి ఆడపిల్లలతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ వుంది. అప్పటికి ఫొటోల కల్చర్ లేదు.
మేము ఏదో నాలుగు పిచ్చి ప్రశ్నలు వేస్తే తెలుగులోనే సమాధానం చెప్పింది. ఇంతలో షాట్ రెడీ అన్నారు. ఆమెతో పాటు మేమూ వెళ్లాం. మూడు రోడ్ల కూడలిలో సౌందర్య వుంటే విలన్ మనుషులు ఒకరు ట్రాక్టర్‌లో, ఇంకొకరు జీపులో, మరొకరు బైక్‌లో మూడు వైపుల నుంచి వస్తారు. అందులో ఒక నటుడికి బైక్ నడపడం సరిగా రాదు. చాలా టేక్‌లు తినేశాడు. ఆ రోజుల్లో ఫిల్మ్ వాడేవాళ్లు. డైరెక్టర్ తల పట్టుకున్నాడు. తర్వాత షాట్ శ్రీకాంత్ కోపంగా ఏదో చెప్పబోతే “రాముడూ” అని సౌందర్య వారిస్తుంది. సౌందర్య సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సౌందర్యతో ఫొటో తీయించుకున్నాం కానీ, ఎక్కడో పోయింది.
తారకరాముడు రిలీజ్ అయినపుడు ఆసక్తిగా వెళ్లి చూశాను. నాకెందుకో నచ్చలేదు. రొటీన్ సినిమా. తర్వాత సౌందర్య సినిమాలు చాలా చూశాను. తారకరాముడు షూటింగ్ ఒక జ్ఞాపకంగా వుండిపోయింది.
ఆమెకి రాజకీయాలకి ఏమీ సంబంధం లేదు. అనవసరంగా రాజకీయ ప్రచారానికి బయల్దేరి విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆ రోజంతా బాధగా అనిపించింది. బతికి వుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి సినిమాలు చేసేది. (జూలై 18 సౌందర్య పుట్టిన రోజు, ఒక రోజు ఆలస్యంగా)
జీఆర్ మహర్షి