కొంత మంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకే తప్ప ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్ నిన్న కోరిన సంగతి తెలిసిందే.
అనర్హత వేటు ఫిర్యాదుపై రఘురామకృష్ణంరాజు తనదైన స్టైల్‌లో స్పందించారు. వైసీపీ లోక్‌సభ చీఫ్‌విప్ ఫిర్యాదు చేసినట్టు తానెలాంటి పార్టీ కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాల అమల్లో లోపాలను మాత్రమే ప్రస్తావించానని రఘురామ తెలిపారు. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
పార్టీలో కొందరు తప్పుడు వ్యక్తులున్నారని, అలాంటి వారి నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసినట్టు చెప్పుకొచ్చారు. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని హెచ్చరించారు. తనపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని రఘురామ గుర్తు చేశారు.
రఘురామ చెప్పే ప్రకారం వైసీపీకి ఆయన శ్రేయోభిలాషి. అలాంటి మంచి నాయకుడిని దూరం చేసుకోవాలని వైసీపీ ఎందుకు భావిస్తున్నదో మరి! రఘురామకృష్ణంరాజు వల్ల పార్టీలో ఎవరెవరు ఎలాంటి వాళ్లు తెలుసుకునే అవకాశం అధికారం పార్టీకి దక్కింది.
పొగడ్తలు కాకుండా సద్విమర్శలు చేసే రఘురామలాంటి నాయకుడిని దూరం చేసుకోవడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రహిస్తున్నట్టు లేదు. హేమిటో…రఘురామ. మంచితనానికి కాలం లేదని సరిపెట్టుకోండి రాజుగారు.