శివ‌సేన ఎంపీల్లో చీలిక‌.. ప్ర‌భుత్వంలోకి సేన‌!

శివ‌సేన‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పెట్టిన చిచ్చు ఇప్ప‌టికే తీవ్ర‌రూపం దాల్చిన ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కూల్చేసిన సంగ‌తి తెలిసిందే.  Advertisement ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు బీజేపీ స‌పోర్ట్ తో ప్ర‌భుత్వంగా ద‌ర్జాగా…

శివ‌సేన‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పెట్టిన చిచ్చు ఇప్ప‌టికే తీవ్ర‌రూపం దాల్చిన ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కూల్చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు బీజేపీ స‌పోర్ట్ తో ప్ర‌భుత్వంగా ద‌ర్జాగా మ‌నుగ‌డ సాగిస్తూ ఉండ‌గా, ఇప్పుడు శివ‌సేన ఎంపీల్లో కూడా స్ప‌ష్ట‌మైన చీలిక త‌ప్పేట్టు లేదు! శివ‌సేన‌కు సంబంధించిన 19 మంది ఎంపీల్లో 12 మంది చీలిక వ‌ర్గంవైపు మొగ్గు చూపుతున్న‌ట్టుగా స‌మాచారం.

వీరంతా ఏక్ నాథ్ షిండే నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థిస్తున్నార‌ట‌! ఈ మేర‌కు లోక్ స‌భ స్పీక‌ర్ కు వీరు లేఖ ఇవ్వ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. లోక్ స‌భ‌లో త‌మ‌దే అస‌లైన శివ‌సేన వ‌ర్గంగా గుర్తించ‌మ‌ని వీరు కోర‌బోతున్న‌ట్టుగా స‌మాచారం. రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ట్టుగా.. ఈ తిరుగుబాటుకు బీజేపీ మ‌ద్ద‌తు ప‌లుకుతున్న నేప‌థ్యంలో.. తిరుగుబాటు వ‌ర్గానికి అధికారిక గుర్తింపు ద‌క్క‌డం పెద్ద విష‌యం కాదు.

అంతే కాదు.. శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గానికి కేంద్ర ప్ర‌భుత్వంలో కూడా భాగ‌స్వామ్యం ద‌క్క‌బోతోంద‌నేది మరో ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యం. ఇది వ‌ర‌కూ శివ‌సేన బీజేపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామే. ఆ త‌ర్వాతి ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. ఉద్ధ‌వ్ ఠాక్రే నాయ‌క‌త్వంలో శివ‌సేన‌కు ద‌క్కిన‌న్ని కేంద్ర మంత్రి ప‌ద‌వుల క‌న్నా.. ఇప్పుడు తిరుగుబాటు వ‌ర్గానికి ఎక్కువ ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌ట‌!

షిండే నాయ‌క‌త్వాన్ని ఆమోదిస్తున్న 12 మంది ఎంపీల్లో కొంద‌రికి కేంద్ర‌మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌నుంద‌ని, ఈ మేర‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేను మ‌రింత ఇబ్బందిలో పెట్ట‌డానికి బీజేపీ అన్ని అవ‌కాశాల‌నూ వినియోగించుకోనుంద‌ని స‌మాచారం.