బీజేపీకి మొదటి నుంచి కూడా పట్టభద్రుల సీట్లలోనే పట్టుంది. ఎమ్మెల్యేలుగా గెలవలేకపోవచ్చు కానీ గ్రాడ్యుయేట్ సీట్లలో బీజేపీ గెలుస్తూ వస్తోంది. అలా దశాబ్దాలుగా శాసనమండలిలో తన ఉనికిని చాటుకుంటోంది. ఉత్తరాంధ్రా జిల్లాల ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఆది నుంచి కంచుకోటగా ఉంది.
నాడు జనసంఘ్ కాలంలో బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచారు. ఇక శాసన మండలి మధ్యలో రద్దు అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాక రెండు సార్లు కమ్యూనిస్టులు గెలిచి బీజేపీకి ఝలక్ ఇచ్చారు. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ 2017లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
నాడు పీవీ చలపతిరావు కుమారుడు పీవీఎన్ మాధవ్ ఈ సీటు గెలుచుకున్నారు. ఇపుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారికి బీజేపీతో టీడీపీకి పొత్తు లేదు. దాంతో ఫస్ట్ టైమ్ ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ మీద వైసీపీ కన్ను వేసింది. తమ పార్టీ తరఫున బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ని ఎంపిక చేసింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది. పైగా అంగబలం, అర్ధబలం ఉన్నాయి. ఈసారి మనమే గెలిచి తీరాలన్న వైసీపీ ఆదేశాలు కూడా గట్టిగా పనిచేయనున్నాయి. దాంతో ఈ సీటు మీద వైసీపీ గురి పెట్టింది. దీంతో ఈసారి పోరులో కమ్యూనిస్టులు అయినా బీజేపీ అయినా కూడా వైసీపీ చేతిలో ఓటమి ఖాయమని అంటున్నారు.
మొత్తానికి బీజేపీకి లేక లేక శాసనమండలిలో ఉన్న ఆ ఒక్క సీటుకూ వైసీపీ ఎసరు పెట్టేసింది అంటున్నారు.