వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ఖరారు చేసింది. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు. విశాఖ-శ్రీకాకుళం- విజయనగరం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రరెడ్డి, అలాగే చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఎంపిక చేశారు.
సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతే ఈ ఎంపిక జరిగింది. అయితే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పేర్నాటి శ్యాం భార్య హేమ సుస్మిత ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీలో కీలక నాయకుడు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఒకవైపు పేర్నాటి అభ్యర్థిత్వం ప్రకటన, మరోవైపు నకిలీ మద్యం కేసులో విచారణకు హాజరవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిగా వుంటూ…తన మీద, తన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. తనను వేధిస్తుండడంపై కేంద్ర, రాష్ట్ర మానవ హక్కులకు ఫిర్యాదు చేస్తానని ఆయన అంటున్నారు.
నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారని స్వయంగా ఆయనే ఆరోపించడం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది. రాష్ట్రస్థాయిలో పెద్దల సభకు ఇలాంటి నాయకుడినా పంపేదని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రశ్నిస్తోంది. నకిలీ మద్యం కేసులో నిందితునిగా ఉన్న పేర్నాటిని తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించడం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రెండురోజుల్లో తనపై విజిలెన్స్ అధికారులు ఏ విధంగా దాడి చేయబోతున్నారో చెబుతానని పేర్నాటి ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజిలెన్స్ అధికారులు కేసును మూవ్ చేస్తున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
పశ్చిమ పట్టభద్రుల రాయలసీమ నియోజకవర్గం నుంచి వివాద రహితుడిని ఎంపిక చేసి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్యాం అభ్యర్థిత్వం ప్రకటించడమే ఆలస్యం… తనే స్వయంగా ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టు వాపోవడం చర్చనీయాంశమైంది. పేర్నాటి ఆస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లా రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇవ్వడం అంటే నకిలీ మద్యం ద్వారా అక్రమ ఆస్తుల్ని సంపాదించినట్టు నిర్ధారణకు వచ్చినట్టే అనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీ హయాంలో నకిలీ మద్యం కేసు నమోదు చేయడం వాస్తవమే అని, అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉందని, శ్యాంప్రసాద్ ఆస్తుల్ని సీజ్ చేసే ఆలోచనలో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే శ్యాం నేరం చేసినట్టు జగన్ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వడం కాదా అని మాజీ మంత్రి సోమిరెడ్డి నిలదీస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీ జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేదని పౌర సమాజం అభిప్రాయపడుతోంది. మొత్తానికి శ్యాం ఎంపికతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిందని చెప్పొచ్చు.