టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే, భవిష్యత్‌లో ఎవరూ కాపాడలేరని ఆయన హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ నేతలను లోకేశ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా రుణం తీర్చుకుంటామని లోకేశ్ హెచ్చరించారు. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తగ్గేదే లేదని తమ చర్యల ద్వారా సంకేతాలు పంపుతున్నారు. రెండు పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై తాజా హత్య యత్నం ఘటన మరోసారి రెండుపార్టీల మధ్య మాటల తూటాలు పేల్చుతోంది.
లోకేశ్ సీరియస్‌గా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శిశుపాలుడితో పోల్చారు. తన పార్టీ కేడర్‌ను భయపెట్టాలని అనుకుంటున్న జగన్ పాపాలు పండాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేకత పెరగడం, మరోవైపు రాజకీయ ఆధిపత్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేస్తున్న హత్యలు, దాడులే ఆయన పతనానికి దారులని లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం వైసీపీ గూండాల పనే అని ఆయన స్పష్టం చేశారు.
బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ సర్కారుదే బాధ్యత అని లోకేశ్ హెచ్చరించడం గమనార్హం. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడని, దీన్నిబట్టి అధికార పార్టీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థం అవుతోందన్నారు. ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులు ఆపాలని లోకేశ్ డిమాండ్ చేశారు. లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండాలని అధికార పార్టీని హెచ్చరించారు.
జగన్‌రెడ్డి అధికారం, పోలీసులు అండగా వున్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇదే చివరి హెచ్చరికని లోకేశ్ చెప్పారు. తాము తిరగబడితే, మీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేదెవరు? అని లోకేశ్ ప్రశ్నించడం గమనార్హం.
తాము అధికారంలోకి వస్తే… ఇవే రకమైన దాడులను చూస్తామని, అప్పుడెవరూ వైసీపీ నేతల్ని కాపాడే దిక్కు వుండదని నేరుగానే లోకేశ్ హెచ్చరికలు పంపడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏ రకంగా హింసాత్మకంగా సాగనున్నాయో నేతల మాటలే తెలియజేస్తున్నాయి.