మన దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అంటే రాష్ట్రపతి పదవి. ఆ తరువాత ఉపరాష్ట్రపతి పదవి. ఇవి జాతీయస్థాయిలో అత్యున్నత పదవులు. ఇక రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు కూడా రాజ్యాంగ పదవులే. ఇవి బ్రిటిష్ పరిపాలనా విధానం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. ఒకసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు చేసి రిటైర్ అయ్యాక వారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీయో, ఎమ్మెల్యేనో కాలేరు. ఎందుకంటే ఆ రెండు పదవులకు ఉన్న గౌరవం అటువంటిది.
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి అపరిమితమైన అధికారాలు ఉంటాయిగానీ కొన్ని సందర్భాల్లో మినహాయించి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు. రాష్ట్రపతి ఏ పనులైనా కేంద్ర మంత్రి మండలి సలహా ప్రకారమే చేయాల్సి వస్తుంది. రాష్ట్రపతి అంటే రాజులాంటివాడు కాబట్టి రాజ్యాంగపరంగా అత్యున్నతమైన గౌరవం ఉంటుంది. రెండో అత్యున్నతమైన పదవి ఉప రాష్ట్రపతి పదవి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తాడు.
రాష్ట్రపతి పంజరంలో చిలుక మాదిరిగా ఉంటే, ఉప రాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్ గా కొంత క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు పదవుల్లో ఉన్నవారు నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి. రాజకీయాలు అసలు మాట్లాడకూడదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎంపికైనవారు తామున్న పార్టీలతో సంబంధాలు తెంపుకోవలసిందే. గవర్నర్ కూడా రాజ్యాంగ పదవే కాబట్టి అదృష్టం, పరిస్థితులు కలిసొస్తే రాష్ట్రపతి కావొచ్చు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కూడా గవర్నర్ గా పనిచేశారు కదా. గవర్నర్ పదవి చేసినవారు కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇక స్పీకర్ (అసెంబ్లీ, లోక్ సభ) పదవి కూడా రాజ్యాంగ పదవే. కానీ స్పీకర్ పదవీ కాలం ముగిశాక వారు క్రియాశీల రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు స్పీకర్ గా పనిచేశారు. వాస్తవానికి స్పీకర్ కు కూడా తన పార్టీతో సంబంధం ఉండకూడదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
కానీ ఇప్పటి స్పీకర్ లు తమకు ఆ పదవి ఇచ్చిన అధికార పార్టీకే కొమ్ముకాస్తుంటారు. సభలోనూ అలాగే వ్యవహరిస్తారు. బయట కూడా అధికార పార్టీ నాయకుడిగా మాట్లాడతారు. నిజానికి స్పీకర్ రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ నాయకుడి మాదిరిగానే వ్యవహరిస్తుంటారు. పబ్లిగ్గా రాజకీయాలు మాట్లాడటమే కాకుండా బూతులు కూడా మాట్లాడతారు. స్పీకర్ పదవి కూడా చాలా గౌరవనీయమైనదే. కానీ తమ్మినేనిలాంటి వారు ఆ పదవి గౌరవాన్ని మంటగలుపుతున్నారు.
స్పీకర్ పదవి చేసినవారు ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు కావొచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి చేస్తారని తెలుగు ప్రజలు అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. నిజానికి ఆ పదవికి కావలసిన అన్ని అర్హతలూ వెంకయ్యకు ఉన్నాయి.
ఆయన్ని ఉపరాష్ట్రపతిగానైనా కొనసాగిస్తారన్న సంకేతాలు మోడీ దగ్గర నుండి ఏరోజూ కనబడలేదు. క్రియాశీల రాజకీయాల నుండి తప్పించాలన్న ఏకైక ప్లాన్ తోనే వెంకయ్యను మోడి ఉపరాష్ట్రపతిగా పంపారు. వెంకయ్యకు ఎక్సటెన్షన్ ఇవ్వటం వల్ల పార్టీకి వచ్చే ఉపయోగం కూడా ఏమీలేదు. ఈయనేమీ జనబలం ఉన్న నేతకాదు. వెంకయ్యను కంటిన్యుచేయటం వల్ల పార్టీపరంగా ఏపీలో వచ్చే లాభంకూడా ఏమీలేదు. మోడీ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీకి లాభం జరిగేట్లుగానే ఉంటుందనటంలో సందేహం అక్కర్లేదు. మొత్తం మీద క్రియాశీలక రాజకీయాల్లో వెంకయ్య నాయుడు శకం అంతరించింది.