ఆ వైసీపీ ఎమ్మెల్యే.. టికెట్ గురించి మరిచిపోవచ్చు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటి నిలిచిన వారిలో అందరికంటె ముందున్న వ్యక్తిని నేను. ఆయన కోసం పదవులను త్యాగం చేసిన తొలిబ్యాచ్ నాయకుల్లో ఒకడిని నేను. నాకంటె ఈ పార్టీలో అగ్రపీఠం మరెవ్వరికి దక్కుతుంది..…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటి నిలిచిన వారిలో అందరికంటె ముందున్న వ్యక్తిని నేను. ఆయన కోసం పదవులను త్యాగం చేసిన తొలిబ్యాచ్ నాయకుల్లో ఒకడిని నేను. నాకంటె ఈ పార్టీలో అగ్రపీఠం మరెవ్వరికి దక్కుతుంది.. అని సదరు నాయకుడు గట్టిగా భావించడంలో తప్పులేదు. ఆయన అనేట్లుగా.. జగన్ వెన్నంటి నిలిచిన తొలి బ్యాచ్ త్యాగమూర్తుల్లో ఆయన కీలకమైన వ్యక్తే. కానీ.. అంతమాత్రాన ప్రజలకు దూరంగా మెలగుతూ ఉంటే.. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను కూడా చేయకుండా.. మోనార్క్ లాగా వ్యవహరిస్తూ ఉంటే… జగన్ ఆయనకు కలకాలం పెద్దపీట వేస్తూనేఉంటారని భ్రమపడితే మాత్రం పొరబాటే. అందుకే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక  కీలక నాయకుడికి ఈసారి ఎన్నికల్లో టికెట్ హుళక్కే అనే ప్రచారం ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. 

నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక కీలకనేత. ఎన్టీఆర్ జమానాలో ఒకప్పట్లో ఎంతో కీలకంగా మెలగిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్లి ఆ తర్వాత.. జగన్ కు నమ్మిన బంటులా వెన్నంటి వచ్చారు. జగన్ కు తాను ఎంతో చేశానని, తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనని కూడా అంటూ ఉంటారు. కానీ మంత్రి వర్గ కూర్పు ఎఫ్పుడూ కూడా.. కేవలం వారి ప్రతిభల మీద మాత్రమే కాకుండా.. అనేక ఇతర కారణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. రకరకాల సమీకరణాలు కేబినెట్ కూర్పును ప్రభావితం చేస్తాయి. అలా ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అందుకు ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. 

ఈ అసంతృప్తి ఒక ఎత్తు కాగా, సహజంగానే దూకుడుగల నాయకుడైన ప్రసన్న కుమార్ రెడ్డి.. పార్టీని ఇరకాటంలో పెట్టేలాగా.. గతంలో కూడా అనేక సందర్భాల్లో నోరువిప్పిన సంఘటనలున్నాయి. అవేవీ కూడా జగన్ అంత సీరియస్ గా పట్టించుకోలేదు. 

కానీ, జగన్ మోహన్ రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా ప్రతిష్ఠాత్మకంగా గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే స్వయంగా తిరగాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ తిరిగే వారు మనకు తెలుసు. కానీ.. గెలిచిన తర్వాత.. వీధుల్లో ఊరేగుతూ చేతులు ఊపేవాళ్లే తప్ప.. ఇంటింటికీ తిరిగే వారిని మన సమాజం ఎరగదు. అందుకే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమం ప్లాన్ చేశారు. దాంతో పాటు.. ప్రతి ఇంటికీ ఇండివిడ్యువల్ గా ప్రభుత్వం ఏం సంక్షేమం చేపట్టిందో వారికి తెలియజెప్పడం ఒక వ్యూహం. 

వీటన్నింటినీ మించి.. విశ్లేషకులు అంచనా వేస్తున్నదాన్ని బట్టి.. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ఇంతటితో అయిపోదు. లబ్ది పొందిన కుటుంబాలను నిర్దిష్టంగా ఏరుతున్నారు గనుక.. వారితో ముందు ముందు చాలా ఫాలో అప్ భేటీలు.. పార్టీ కేడర్ వారితో తరచూ టచ్ లో ఉండడం లాంటివి కూడా జరుగుతాయి. అలా వారిలో పార్టీ పట్ల కమిట్మెంట్ పెంచుతారు. స్ట్రాంగ్ ఓటర్లుగా తయారు చేసుకుంటారు. ఇదంతా పెద్ద ప్రణాళిక.

అలాంటి మంచి కార్యక్రమాన్ని అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటిదాకా పట్టించుకోకుండా ఉన్నది ఇద్దరే ఎమ్మెల్యేలు. ఆళ్ల నాని ఒకరు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండో వారు. దీనిపై సీఎం అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఇదొక్కటే అయితే.. వారు ఏవో సర్ది చెప్పుకోగలరు. కానీ గతంలో ఉన్న అనేక ఇతర అనుభవాలను కూడా కలిపి బేరీజు వేసుకుని.. రాబోయే ఎన్నికల్లో నల్లపురెడ్డికి టికెట్ నిరాకరిస్తారనే ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది. 

ఆ మాటకొస్తే.. 151 మందిలో ఇంకా చాలా మందికి టికెట్లు రాకపోవచ్చు. జగన్ తన వైపు లోపం లేకుండా.. పనిచేసే వారికే, ప్రజల్లో ఉండేవారికే టికెట్లు అని పదేపదే చెబుతూ వస్తున్నారు. ఆ ప్రకారం పలువురు సిటింగులు అవకాశం కోల్పోవచ్చు గానీ.. ఆ జాబితాలో మొదట కన్ఫర్మ్ అయిన పేరు నల్లపురెడ్డిదే అని పలువురు అనుకుంటున్నారు.