Advertisement

Advertisement


Home > Politics - Analysis

ధనవనరులు- 2024 : పవన్‌కు ఇక దిగుల్లేదు!

ధనవనరులు- 2024 : పవన్‌కు ఇక దిగుల్లేదు!

ఈ రోజుల్లో ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రధానంగా కావాల్సింది ధన బలం. మనది ప్రజాస్వామ్యమే అయినా.. ప్రజాబలం అనేదే ఎన్నికలకు ప్రామాణికం అయినా, ప్రజలను డబ్బుతో కొనుక్కోవచ్చుననేది మనకు స్థిరపడిపోయిన నమ్మకం. అందుకే.. డబ్బున్నవాళ్లను.. లెక్కలేకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్లను మాత్రమే.. ఏరి ఏరి పార్టీలు తమ అభ్యర్థులుగా మోహరిస్తుంటాయి. ఈ విషయంలో ఎవ్వరూ తక్కువ కాదు.

కాకపోతే 2019 ఎన్నికల సమయానికి తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో పోటీచేసిన జనసేన పార్టీ అభ్యర్థులు పెట్టిన ఖర్చు చాలా తక్కువ. ఆ పార్టీ మాత్రం డబ్బు పరంగా కూడా గట్టివారికే టికెట్లు ఇచ్చారు గానీ.. వారిలో అతి కొద్దిమందే.. గెలుపు మీద నమ్మకంతో ఘనంగా ఖర్చు పెట్టారు. చాలా మంది గెలిచేట్లయితే.. పవన్ చరిష్మాతో గెలుస్తాం కదా.. అనే ఉద్దేశంతో డబ్బు బయటకు తీయకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా.. ఓటర్లకు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడం లాంటి వాటికి పాల్పడలేదు. ఆ విషయంలో పవన్ ఎన్నికల అరాచకపోకడలకు పాల్పడకూడదనే చిత్తశుద్ధితో ఉన్నారనే అనుకోవాలి. అయితే తనలాంటి అత్యద్భుతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి.. డబ్బులు ఖర్చు పెట్టకపోయినా గెలుస్తాడు అనే నమ్మకం కూడా ఆయనలో ఉండవచ్చు. మొత్తానికి రెండుచోట్లా ఓడిపోయారు. 

ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత.. ధన వనరుల పరంగా ఉన్న బలహీనత కారణంగా తాము ఓడిపోయామే తప్ప.. ప్రజాదరణ లేక కాదని జనసేన పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది. తమకున్న ప్రజాదరణకు తోడు.. ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టడం కూడా కొంతవరకు గట్టిగా చేసిఉంటే.. గెలిచేవాళ్లమని వారు అనుకున్నారు. అందుకే.. 2024 ఎన్నికలకు డబ్బు ఖర్చు విషయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో తగ్గకూడదనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ఒకవైపు క్లీన్ ఇమేజి కనిపించాలి.. రెండో వైపు విచ్చలవిడిగా కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి.. అనుకునేట్లయితే, అభ్యర్థులు దొరికేదెలాగ? అభ్యర్థులకు పార్టీ తరఫున కూడా కొంత ధనసాయం అందిస్తే గెలుపు అవకాశాలు పెరుగుతాయి కదా.. వంటి లెక్కలు వేసుకున్నారు. 

ఆ వ్యూహం బాగానే ఉంది. కానీ.. పార్టీ తరఫున సాయం అందించేదెవ్వరు. ?

పార్టీ నడపాలంటే డబ్బు కావాలి కదా అందుకే సినిమాలు చేస్తున్నా అంటారు పవన్ కల్యాణ్. ఆ సంగతి పక్కన పెడితే.. ఎన్నికలంటే.. ఏదో షూటింగ్ జరుగుతున్న నిర్మాత ఖర్చుతో ఎవరికైనా సాయం అందించి.. తాను చేసిన సాయం లాగా పత్రికా ప్రకటన రిలీజ్ చేయడమూ, తన తల్లి ఇచ్చిన విరాళం, అన్న ఇచ్చిన విరాళం లాగా పేర్లు పెట్టి.. కొన్ని చావులను ఆత్మహత్యలుగా విశ్వసించి వారికి తలో లక్షా పంచడం మాత్రమే కాదు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది--ఇరవై కోట్లయినా పెట్టాల్సిందే. ఈ లెక్కల్లో పార్టీకి నిధులు ఎలాగ అనే మీమాంస జనసేనానికి కలిగింది. 

ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎన్నికలకు ధనవనరుల కొరత తీరిపోయింది. ఒక ఒప్పందం కుదిరినట్లుగా ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఒప్పందం మేరకే.. వైసీపీ ఎంపీ రఘురామరాజును.. పవన్ కల్యాణ్ భజన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన రఘురాజుకు అనుకూలంగా చాలా చాలా మాట్లాడారు. ఇదంతా కూడా వచ్చే ఎన్నికల సమయానికి ఆయన పార్టీకి వెన్నెముకలా ఉండే ఒప్పందం మీదనే అని ప్రజల భావన.

వైసిపి ఎంపీగా గెలవడానికే తాను పార్టీకి చాలా పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చానని అర్థం వచ్చేలా.. రఘురామ రాజు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే.. తన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఎన్నికల ఖర్చులకు భారీగా తాను డబ్బు ఇచ్చినట్లు అర్థం వచ్చేలా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన వైసీపీ పై కక్ష కట్టి ఉన్నారు. జగన్ ను ఓడించడానికి కొన్ని కీలక స్థానాలకు తాను డబ్బు సర్దుతానని పవన్ కు హామీ ఇచ్చినట్లుగా గుసగుసలు ఉన్నాయి. 

తెలుగుదేశంతో పొత్తులు కోరుకుంటున్న పవన్ కల్యాణ్ కు మహా అయితే.. 175లో 30 సీట్లు మించి దక్కవు. ఆ 30 సీట్లలో పార్టీ అభ్యర్థులకు తలో మూడు కోట్ల రూపాయలు.. పార్టీతరఫు నుంచి సర్దుబాటు చేయడానికైనా రఘురామరాజు సై అన్నట్టు సమాచారం. ఎంపీ పదవి కోసం వంద కోట్ల రూపాయలు పార్టీలకు ముడుపులు ఇస్తున్న వారు ఉన్నారు. అదే క్రమంలోనే.. తాను మళ్లీ ఎంపీ కావడానికి.. పార్టీకి వంద కోట్ల రూపాయల వరకు డబ్బు సమకూర్చడగలనని రఘురామ రాజు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం ఉంది.

రఘురామ రాజు అవసరమైతే వందల కోట్ల భారాన్ని మోస్తాడు గనుకనే.. ఆయన నెత్తిన ఆ బరువు తోసేసి.. ఎన్నికల్లో పోరాడవచ్చు గనుకనే పవన్ ఇప్పటినుంచి ఆయనను అంతగా పొగుడుతున్నారని ప్రజల అభిప్రాయం. ఏదో ఒక డీల్ లేకుండా.. ఏ పనీ జరగని రోజులివి. పేమెంట్ కొంచెం బ్యాలెన్స్ ఉంటే.. షూటింగ్ పూర్తయిన తర్వాత.. హీరోలు డబ్బింగ్ కు రాకుండా నిర్మాతను వేపుకుని తింటున్న రోజులివి. ఏదైతేనేం పవన్ కల్యాణ్ తన పార్టీకి ధన వనరుల కొరతను ఈ రకంగా తీర్చుకున్నారని, ఈసారి ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?