పరుగుపందెంలో గెలవడానికి స్వయంకృషి సరిపోతుంది. పరీక్షల్లో గెలవడానికి స్వయంప్రతిభ సరిపోతుంది. కోచెస్ చెప్పింది చేయడం అందులో భాగం.
కానీ రాజకీయల్లో గెలుపన్నది అలా రాదు. ఎందరో కోరుకుంటే తప్ప అది సాధ్యం కాదు. జనం మనసు గెలవాలి, కేడర్ నమ్మకం పొందాలి, అభిమానుల బలం తోడవ్వాలి. ఇన్ని జరిగితేనే జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడం తటస్థించింది.
ముఖ్యంగా చెప్పుకోవల్సింది 2019 ముందు నాటి వైసీపి సోషల్ మీడియా గురించి. కేంద్రంలో బీజేపి తర్వాత దేశం మొత్తంలో అత్యంత బలమైన సోషల్ మీడియా వింగున్న పార్టీ అప్పట్లో వైసీపియే.
అది అధికారికంగా నెలకొల్పింది కాదు. పద్ధతిప్రకారం నడిపిందీ కాదు. దానికి లీడరెవ్వరూ లేరు. కేవలం ఇండియాలోనూ, విదేశాల్లోనూ ఉన్న ఐటీ ఉద్యోగులు తమ అభిమానం మీద వైసీపిని భుజాన మోసారు. తెదేపా సోషల్ మీడియాకి చెమట్లు పట్టించారు. వైసీపి సోషల్ మీడియా ధాటికి ప్రత్యర్థులు అల్లల్లాడారు. జనంలోకి జగన్ పై సానుకూలత విపరీతంగా వెళ్లడానికి ప్రముఖ కారణం సోషల్ మీడియా. ఆ తర్వాతే ఎవరైనా, ఏదైనా.
మొత్తానికి వైసీపి నెగ్గింది. సోషల్ మీడియా యోధులు సంబరాలు చేసుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి నుంచి వారిలో ఏ ఒక్కరికీ ధన్యవాదాలు కానీ గుర్తింపు కానీ దక్కలేదు. జగన్ అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకున్న వాళ్లకి కూడా అడియాసే మిగిలింది.
నిజానికి క్షేత్రస్థాయిలో ఎంత జరిగిందో జగన్ కి తెలియకపోవచ్చు. కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత కొందరికుంటుంది. వారా పని చెయ్యలేదు.
మొత్తానికి సోషల్ మీడియా పవరేమిటో మాత్రం అర్థమయ్యి దాన్ని ఆర్గనైజ్డ్ గా చెయ్యడం కోసం డిజిటల్ మీడియా కార్పొరేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే అది పూర్తిగా ప్రభుత్వపరమే తప్ప పార్టీపరం కాదు. జనానికి అందిస్తున్న స్కీముల గురించి, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియజెప్పడమే ఆ కార్పోరేషన్ చేస్తుంది తప్ప ప్రతిపక్షాల్ని ఎదుర్కునే ట్రోలింగులు, మీములు చెయ్యదు.
కనుక దానికోసం పార్టీఖర్చుతో మరొక సోషల్ మీడియా వింగ్ పెట్టుకున్నారు. అయితే దానికి నలుగురు ఇంచార్జుల్ని నియమించారు జగన్. అదే పెద్ద పొరపాటయ్యింది. ఒక్కడి నెత్తిమీదే బాధ్యత పెడితే ఓనర్షిప్ ఫీలింగుతో ఏదైనా బలంగా చేస్తాడు. నలుగురికి పంచితే ఎవరికీ సీరియస్నెస్ ఉండదు. అదే జరుగుతోందిప్పుడు. కానీ సోషల్ మీడియా ప్రచారం కోసం కోట్ల రూపాయల పార్టీధనాన్ని వెచ్చిస్తోంది వైసీపి. ఫలితం మాత్రం శూన్యం.
పోనీ 2019లో పార్టీని భుజాన మోసిన యోధుల్ని నిద్రలేపుదామా అంటే వాళ్లంతా ఎప్పుడో చెల్లాచెదురైపోయారు. కారణమేంటంటే సీబీఐ వాళ్ళ మీద పెట్టిన కేసులు. చాలామంది యువకులు నెలలపాటు జైళ్లల్లో కూడా మగ్గారు.
సీబీఐ అనేది కేంద్రప్రభుత్వ కనుసన్నల్లో ఉంటుంది. వైసీపికి కేంద్రంతో సత్సంబంధాలున్నాయి. అయినప్పటికీ విషయాన్ని మనసుకి తీసుకుని తమకోసం పోరాడి జైల్లో ఉన్న యువకుల్ని బయటకు తీసుకురాలేకపోయింది వైసీపి ప్రభుత్వం.
ఆ రకంగా ఎటువంటి భరోసా లేకపోవడంతో ఎందుకొచ్చిన గొడవని చాలామంది వైసీపి అభిమానులు సైలెంటైపోయారు.
దేశంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వైసీపి సోషల్ మీడియాని ఇప్పుడు పూర్తిగా అధోగతి పాలు చేసుకున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వానా కాలంలో రోడ్ల దుస్థితి గురించి మాట్లాడుతుంటేనే డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది పార్టీ. నిజానికి సోషల్ మీడియా బలంగా ఉంటే అసలు నాయకులకి ప్రతిపక్షాలకి సమాధానాలు చెప్పాల్సిన పని కూడా ఉండదు. వాళ్ల పని వాళ్లు చేసుకుపోవచ్చు. పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబైనా ఏం మాట్లాడినా వైసీపి సోషల్ మీడియా నుంచి సౌండ్ వినిపించకపోవడం పెద్ద వార్ణింగ్ బెల్.
మొత్తానికి సొషల్ మీడియాలో ఉన్నవాళ్లని గుర్తించిక పోగొట్టుకుని, పెట్టుకున్న దానికి నలుగురు ఇంచార్జుల్ని తగిలించి డబ్బులు తగలేస్తూ ఉన్నా ఎటూ కాకుండా పోయింది వైసీపి సోషల్ మీడియా వింగ్. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఏడాదిన్నరలో మరింత దిగజారుతుంది. కనుక తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు సాగుతారా లేక కాడె వదిలేసి చతికిలపడాతారా అనేది కాలమే చెప్పాలి.
రానున్న 2024 ఎన్నికలకి సమాయత్తమయ్యే ముందు జగన్ మోహన్ రెడ్డి ఈ దిశగా ఒక్కసారి కన్నుసారించాలి. ఎందుకంటే ఒకనాటి యుద్ధాల్లో అశ్వబలం, గజబలం, సైన్యబలం ఎలాగో..ఇప్పుడు ఎన్నికలనే యుద్ధంలో సోషల్ మీడియా బలం చాలా కీలకం.
– హరగోపాల్ సూరపనేని