ఏపీ సర్కార్‌కు హైకోర్టు ముచ్చటేసే ప్రశ్న సంధించింది. ప్రజల మనసులను చూరగొనేలా ఆ ప్రశ్న వుంది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా హైకోర్టు కీలకమైన అంశాన్ని లేవదీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన స్కూళ్ల విలీనంపై సందర్భోచితంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ ప్రశ్న సంధించడం విశేషం.
ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 107ని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణలో భాగంగా జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే…
‘ రేషన్ షాపులను పక్కనబెట్టి ఇంటి వద్దకు మొబైల్ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాఠశాలల విలీనం పేరుతో 3,4,5 తరగతి పిల్లలను మూడు కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితి తెచ్చారు. ఈ నిర్ణయాల్లో హేతుబద్ధత ఏముంది? నెలలో వీలున్నప్పుడు తమకు దగ్గర్లో ఉన్న రేషన్ షాపుకి వెళ్లి సరుకులు తెచ్చుకోలేని స్థితిలో పేద ప్రజలు లేరు’ అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తమకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయాలని ఏ ఒక్కరూ కోరుకోలేదు. హైకోర్టు చెప్పినట్టు నెలలో ఏదో ఒకరోజు రేషన్ షాపు వద్దకెళ్లి సరుకులు తెచ్చుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్ వాహనం పుణ్యమా అని దాని కోసం పనులు మానుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి. మరోవైపు ఇంటికి సమీపంలోనే ఉన్న స్కూళ్లను మూసివేసి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రజలు కావాలని కోరుకుంటున్నవి ఎత్తేస్తూ, వద్దన్నవి పెడుతూ ప్రభుత్వం అనవసరంగా బద్నాం అవుతోంది.
పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 60 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతులు సమర్పించడం చర్చనీయాంశమైంది. జస్టిస్ బట్టు దేవానంద్ కామెంట్స్, ఎమ్మెల్యేల ఆవేదనను ప్రతిబింబించలేదా? పాఠశాలల విలీనంపై అభ్యంతరాలుంటే తెలపాలని విద్యా మంత్రి రాసిన లేఖకు సొంత పార్టీ నుంచి వచ్చిన స్పందన ఇది. ప్రజల ఆకాంక్షల మేరకు పాలనా విధానాలుంటే బాగుంటుంది.
అలా కాకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే ….చివరికి సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత చవి చూడాల్సి వస్తుంది. పాఠశాలల విలీనంపై జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ బట్టు ఘాటు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం పంతాలకు పోకుండా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.