వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలం… ఏ మాత్రం మొహమాటం లేకపోవడమే. సెంటిమెంట్స్‌కు ఆయన ఎంతమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఆయన ప్రత్యేకత. తాను అనుకున్నది చేసుకుపోవడమే జగన్ నైజం. ఎవరేం అనుకుంటారో, అనుకుంటున్నారనేది ఆయనకు ప్రాధాన్యం కానే కాదు. తాను ఏమనుకుంటున్నాడనేదే కీలకం. మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం రెండేళ్లు ముందుగానే ఎన్నికల వ్యూహం రచిస్తున్నారు.
ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను కూడా ఖరారు చేసే పనిలో ఆయన ఉన్నారని….జగన్ రాజకీయ పంథా తెలియజేస్తోంది. తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమై మరోసారి గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమ అమలు తీరుపై సమీక్షించారు. తాను నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోని వారికి పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మనసులో మాటను పంచుకున్నారు. తనకెలాంటి మొహమాటాలు లేవని కుండబద్ధలు కొట్టారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి మనసు చూరగొన్న వారికే టికెట్లు ఇస్తానని తేల్చి చెప్పారు. లేదంటే టికెట్లు దక్కవని స్పష్టం చేశారు. ప్రజల్లో తిరగని వారిపై గట్టిగా మాట్లాడలేదని అనుకోవద్దని, రేపు ఎన్నికలప్పుడు టికెట్ దక్కకపోతే బాధపడినా ప్రయోజనం వుండదని తన వైపు నుంచి స్పష్టత ఇచ్చారు. ఇక జనంలో వుండడమా? లేక రాజకీయాల నుంచే తప్పుకోవడమా? నిర్ణయించుకోవాల్సింది మీరేనని బంతిని ప్రజాప్రతినిధుల కోర్టులో విసిరారు.
రాజకీయాల్లో జగన్‌ది భిన్నమైన ధోరణి. తన లక్ష్యాలే తప్ప, ఎదుటి వాళ్ల మనోభావాలను ఆయన పరిగణలోకి తీసుకోరు. అంతిమంగా ప్రజల కేంద్రంగా ఆయన నిర్ణయాలు వుంటాయి. అంతే తప్ప, నాయకుల కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవడం జగన్ అభిమతం కాదు. ఎందుకంటే తమ అవసరాల కోసం నాయకులు ఎన్ని అవతారాలైన ఎత్తుతుంటారని జగన్ నమ్మకం. కానీ ప్రజల్లో ఒక్కసారి అభిమాన ముద్ర వేసుకుంటే, అది స్థిరస్థాయిగా నిలిచిపోతుందని జగన్ విశ్వాసం. అదే తనను ముందుకు నడిపిస్తోంది.
తన భవిష్యత్ ప్రజల చేతల్లో వుందని, వారిని ప్రసన్నం చేసుకోవాలని జగన్ తపన పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన పదేపదే జననామ స్మరణ చేయడం. తాను కోరుకుంటున్నట్టు జనంలో తిరగని నాయకులు ఎమ్మెల్యేలు కావడానికి అనర్హులని ఆయన అభిప్రాయం. అంతేకాదు, ప్రజల్లో తిరగలేని నేతలంతా తనకు అయిష్టులనే సంగతిని మరోసారి జగన్ తేల్చి చెప్పారు. ఇందులో మొహమాటాలకు, అలకలకు తావు లేదు. ప్రజల్లో పలుకుబడి ఉన్నవాళ్లే తనకు దగ్గరైన వారని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు.
జగన్ అంతరంగాన్ని తెలుసుకోడానికి ఆయన నిర్మొహమాటంగా మాట్లాడిన మాటలు వింటే చాలు. ఇప్పటికీ జనంలో తిరగకుండా, మూడేళ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని జనానికి వివరించి, మరోసారి ఆశీస్సులు కోరని వారికి వైసీపీలో ప్రయాణ ముగింపునకు రోజులు దగ్గరపడినట్టే. ఎందుకంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే… జగన్‌కు అధికార మంటే ఇష్టం. దాని కోసమే ఈ కసరత్తు అని ప్రజాప్రతినిధులు గుర్తించాలి.
జగన్ భవిష్యత్ అంటే…. అది వైసీపీ భవిష్యత్‌తో ముడిపడి వుందని గుర్తించాలనేది సీఎం ఉద్దేశం. సీఎంను అర్థం చేసుకుని, జనంలోకి వెళ్లిన వారే ఆ పార్టీలో మిగులుతారనేది సుస్పష్టం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే… అది వైసీపీలో కుదరని పని. సంప్రదాయ రాజకీయాలకు జగన్ ఎప్పుడో తిలోదకాలు ఇవ్వడమే ఇందుకు కారణం.