స్ట్రాంగ్ ప్ట్రాటజీ : అభివృద్ధి @ లోకల్!

అభివృద్ధి సంక్షేమం అనే పదాలకు ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. రోడ్లు వేయడం తప్ప.. ప్రపంచంలో మరేదీ అభివృద్ధి కాదని నమ్మేవాళ్లు కొందరుంటారు. ప్రజలు సంతోషంగా ఉండడం, చిన్న చిన్న అవసరాలకు కూడా పేదరికం…

అభివృద్ధి సంక్షేమం అనే పదాలకు ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. రోడ్లు వేయడం తప్ప.. ప్రపంచంలో మరేదీ అభివృద్ధి కాదని నమ్మేవాళ్లు కొందరుంటారు. ప్రజలు సంతోషంగా ఉండడం, చిన్న చిన్న అవసరాలకు కూడా పేదరికం కారణంగా.. గతిలేని స్థితిలో లేకుండా చూడడమే అభివృద్ధి అనుకునే వారూ ఉంటారు. సంక్షేమం అంటే.. పథకాల ముసుగులో పార్టీ కేడర్, కార్యకర్తల్ని ధనవంతుల్ని చేయడం అని వ్యూహరచన చేసేవారు కొందరుంటారు. 

సంక్షేమం అంటే.. పేదల, వెనుకబడిన వాళ్ల మొహాల్లో చిరునవ్వు చూడడం, దిగులు వారి చెంతకు రాకుండా చూడడం అని నమ్మేవాళ్లు కొందరుంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రెండో రకానికి చెందిన వారు! అందుకే ఆర్థిక వనరుల పరంగా ఇబ్బందులు అనేకం ఉన్న ఈ రాష్ట్రంలో.. అపరిమితమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎలాంటి దళారీ దందాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బులు వేసేస్తున్నారు.

జగన్ ఎన్ని పనులు చేస్తున్నా సరే.. అవన్నీ పక్కన పెట్టి.. వర్షాకాలంలో రోడ్ల మీద గుంతలు ఏర్పడితేనో, పల్లెల్లో మరో చిన్న సమస్య వస్తేనో.. వాటిని భూతద్దంలో చూపిస్తూ..నానా యాగీచేస్తున్న దుర్మార్గమైన మీడియా, ప్రతిపక్షాలు ఉన్న రోజులివి. అందుకే వీరి నోర్లు కూడా మూయించేలా.. అసలు వీరికి ప్రభుత్వాన్ని నిందించే అవకాశమే లేకుండా. కొత్త వ్యూహరచన చేశారు. గ్రామాల స్థాయిలో ఉండే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవడానికి.. ఆ రకంగా.. సమస్యల గురించి ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఏర్పడకుండా చూడడానికి జగన్ సరికొత్త వ్యూహరచన చేశారు. అదే.. ‘‘అభివృద్ధి @లోకల్’!

జగన్ పథకానికి ఈ పేరు పెట్టలేదు. కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం స్వరూపం ఇదేరీతిగా కనిపిస్తోంది. చిన్న చిన్న గ్రామాల వరకు కూడా సమస్యలు లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయించబోతోంది. 

ప్రతిపక్షాలు, పచ్చ మీడియా తమ తమ ఎజెండాతో చూపించే సమస్యలు కొన్నే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా.. ప్రభుత్వానికి ఉన్న విస్తృతమైన యంత్రాంగం ద్వారా.. నిజంగా ప్రజల్లో ఉండే సమస్యలనే తీర్చాలని జగన్ సంకల్పించారు. అందుకే ఒక్కో సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. 

అచ్చంగా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి మాత్రమే కాకుండా, ప్రజల సమస్యలను తెలుసుకోవడం కూడా జగన్ సంకల్పించిన గడపగడపకు కార్యక్రమం లక్ష్యం. ఆ సందర్భంగా ప్రజలు నివేదించి నిజమైన క్షేత్రస్థాయి సమస్యలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఎమ్మెల్యేలు అందరికీ ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో నియోజకవర్గస్థాయిలో చేపట్టాల్సిన పనులు చేస్తారు. అలాగే.. ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షలు ఇస్తారు. ఇవి గ్రామస్థాయి సమస్యలు తీర్చడానికి ఉపయోగపడతాయి. 

ప్రతిపక్షాలు పచ్చ మీడియా ఎన్ని రకాల నిందలు వేస్తున్నా.. తమ కళ్ల ముందు ఏం జరుగుతోంది అనే దానిని బట్టి మాత్రమే ప్రజలు ప్రభావితం అవుతారు. తమ కళ్లెదురుగా ఉన్న సమస్యలు తీరుతూ ఉంటే.. ప్రభుత్వాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. అందుకే పచ్చ ఎజెండాతో సంబంధం లేకుండా.. సంక్షేమం చేపట్టడానికే.. జగన్ నియోజకవర్గం, సచివాలయం స్థాయిలో ప్రత్యేక నిధులు ఇస్తూ అన్ని రకాల ప్రజల సమస్యలను తీర్చే యోచన చేస్తున్నారని అర్థమవుతోంది.