ఆంధ్రప్రదేశ్ లో ఊహించని విధంగా కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ కు సంబంధించి ఆంక్షల్ని మరింత కఠినతరం చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా వైద్య సర్వీసులన్నింటినీ ఎస్మా పరిథిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఏపీ సర్కార్ నుంచి జీవో కూడా జారీ అయింది.
కేవలం ప్రభుత్వ వైద్య సర్వీసులు మాత్రమే కాదు, ప్రైవేట్ వైద్య సర్వీసుల్ని కూడా ఎస్మా పరిథిలోకి తీసుకొచ్చారు. 6 నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఈ కాలంలో వైద్య సిబ్బంది ఎవరూ పనిచేయడానికి నిరాకరించకూడదు. అలా నిరాకరించిన వాళ్లను చట్టరీత్యా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
తాజా జీవో ప్రకారం కేవలం వైద్య సిబ్బందిని మాత్రమే కాకుండా.. పారిశుధ్య సిబ్బంది, విద్యుత్ సరఫరా, ఆహార సరఫరా, భద్రతా సిబ్బంది, బయోమెడికల్ వ్యర్థాల తొలిగింపు, అంబులెన్స్ సర్వీసు, ఆహార సరఫరా రవాణాను కూడా ఎస్మా పరిథిలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడ కుమ్మరిపాలానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన తన కుమారుడి ద్వారా షేక్ సుభానీకి వైరస్ సోకింది. 30వే తేదీనే షేక్ సుభాని మరణించారు.
అయితే సుభానీకి ఆల్రెడీ ఆరోగ్య సమస్యలుండడంతో కరోనా వల్ల మృతిచెందారా లేక ఆనారోగ్య కారణాల వల్ల చనిపోయారా అనే విషయాన్ని నిర్థారించుకోవడం కోసం టైమ్ తీసుకున్నారు. కరోనా వల్ల చనిపోయారని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.